పవన్ కల్యాణ్ హఠాత్తుగా కాపులకు మద్దతుగా మాట్లాడటం మొదలుపెట్టారు. కాపు నేస్తం నిధులు విడుదలైన తర్వాత, ఆ సామాజికవర్గమంతా జగన్ ని దేవుడుగా మరోసారి పొగడ్తల్లో ముంచెత్తుతున్న వేళ పవన్ నాయుడు.. కాపు స్టాండ్ తీసుకున్నారు. 2వేల కోట్లిస్తామని చెప్పి, నాలుగువేల కోట్లకు పైగా ఎలా ఇస్తారని, ఇదెక్కడి న్యాయమని విపరీతార్థాలు తీశారు. మాకు సొమ్ములొద్దు రిజర్వేషన్లు చాలంటూ పాత డిమాండ్ నే కొత్తగా తెరపైకి తెచ్చారు.
అంతా బాగానే ఉంది. 2 రోజుల పాటు వైసీపీ కౌంటర్లు, జనసేన రీకౌంటర్లు అన్నీ మీడియా సాక్షిగా బాగానే హైలెట్ అయ్యాయి. అయితే ఇక్కడ అణచివేసిన పాయింట్ ఒకటుంది. కాపు రిజర్వేషన్లను జనసేనాని తలకెత్తుకోవడం పార్టీలో మిగతా వర్గాలకు నచ్చలేదట. అందుకే పవన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ కానీ, ఆయన్ని ప్రశంసిస్తూ కానీ ఎక్కడా ప్రదర్శనలు జరగలేదు, ఎవరూ బహిరంగంగా మాట్లాడలేదు.
కాపులకు రిజర్వేషన్లు కావాలి, అది కూడా బీసీ-ఎస్సీ-ఎస్టీలకు అన్యాయం జరక్కుండా.. అనేది దాదాపు అసాధ్యమైన విషయం. ఒకవేళ కేంద్రం కల్పించిన 10శాతం అదనపు రిజర్వేషన్లలో 5శాతం కాపులకే ఇచ్చేస్తే.. మిగతా కులాల పరిస్థితేంటి? వారంతా మిగిలిన 5శాతాన్ని అరశాతం చొప్పున పంచుకోవాలా? ఇదెక్కడి లాజిక్. అంటే.. కాపులకు మేలు చేయండంటూనే మిగతా కులస్తులకు అన్యాయం జరిగినా పర్వాలేదంటున్నారు పవన్ కల్యాణ్. ఈ విషయంపైనే జనసైనికుల్లో కాస్త గందరగోళం నెలకొంది.
ఎన్నికలకింకా నాలుగేళ్లు టైమ్ ఉంది, పైగా పవన్ డిమాండ్ చేసిన వెంటనే.. జగన్ కాపు రిజర్వేషన్లపై సమాధానమిచ్చే రకం కాదు, పోనీ కేంద్రం జోక్యం చేసుకుంటుందా అంటే.. అదీ లేదు. అలాంటప్పుడు అసలు పవన్ కల్యాణ్ రిజర్వేషన్ల తేనెతుట్టె కదపడం ఎందుకు? కాపులకు అండగా తాను ఉన్నానని చెప్పుకోడానికే పవన్ బైటకొచ్చారా? లేక నిజంగానే సీఎం జగన్ అందించిన కాపునేస్తం నిధులతో ఆ సామాజిక వర్గానికి న్యాయం జరగలేదా?
ఇదంతా విశ్లేషించి చూస్తే, కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే, కాపు వర్గాన్ని మభ్యపెట్టడానికే పవన్ కల్యాణ్ స్టేట్ మెంట్లిచ్చారని అర్థమవుతోంది. దీంతో ప్రతిపక్షాలు కూడా పవన్ కులగజ్జిని తూర్పారబడుతున్నాయి. అటు సొంతపార్టీలో కూడా పవన్ నిర్ణయాన్ని ఎవరూ సమర్థించడం లేదు. అంటే పవన్ పూర్తిగా రాంగ్ ట్రాక్ లో పడిపోయి, సొంత బలగాన్ని కూడా పోగొట్టుకుంటున్నారని అర్థమవుతోంది.