ప్రధాని మోడీ అన్ లాక్ 2.0 నిబంధనలు చూసిన తర్వాత ఆయన ఉద్దేశమేంటో స్పష్టంగా తెలుస్తోంది. దేశంలో రోజు రోజుకీ కేసులు పెరుగుతున్న తరుణంలో నిబంధనలు కట్టుదిట్టం చేయాల్సింది పోయి, అన్ లాక్ అంటూ మరోసారి షాకిచ్చారు మోడీ. ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా భయంతో స్థానికంగా లాక్ డౌన్ కి సన్నాహాలు చేసుకుంటుంటే ప్రధాని మాత్రం రివర్స్ గేర్ వేశారు. మిగతావన్నీ ఎలా ఉన్నా.. ప్రయాణాలపై మోడీ ప్రభుత్వం చేసిన ప్రకటనని మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి.
ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఇంకా పూర్తిస్థాయిలో రాకపోకలు సాగడంలేదు. ప్రత్యేక అనుమతి ఉంటేనే అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు వెళ్లడానికి వీలవుతుంది. ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లో కూడా ఇదే పరిస్థితి. చెన్నై పూర్తిగా లాక్ డౌన్ లోకి వెళ్లడంతో.. అక్కడ్నుంచి ఏపీకి ఎవరూ రావడానికి సాహసించడం లేదు. ఏపీ, కర్నాటక బోర్డర్ లో మాత్రమే కాస్త వెసులుబాటు ఉంది.
ఇలా చెప్పుకుంటూ పోతే.. కేసుల సంఖ్య పెరుగుతున్న రాష్ట్రాలన్నీ ఇతర రాష్ట్రాలతో సరిహద్దుల దగ్గర కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకున్నాయి. ఇక రేపోమాపో హైదరాబాద్ లో కూడా లాక్ డౌన్ పడేలా ఉంది. ఈ దశలో కేంద్రం పిడుగులాంటి వార్త నెత్తినేసింది. దేశంలో ఎవరైనా, ఎక్కడినుంచి ఎక్కడికైనా(కంటైన్మెంట్ జోన్లు మినహా) ఏ అనుమతి లేకుండా ప్రయాణించ వచ్చని స్పష్టం చేశారు మోడీ.
రాష్ట్రంలో ఒకచోట నుంచి ఇంకో చోటకు వెళ్లేందుకు ఎవరి అనుమతి అక్కర్లేదట, అలాగే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్లే సమయంలో కూడా అనుమతి లేకుండానే వెళ్లొచ్చట. ఏంటీ గందరగోళం. రాష్ట్రాలు వద్దుబాబోయ్ అంటుంటే.. కేంద్రం నిబంధనలను సడలించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఏపీ పరిస్థితి తీసుకోండి.. ఏపీలో ఎక్కువ కేసులకు చెన్నై లింక్ ఉంది. ఇటీవల హైదరాబాద్ నుంచి వచ్చినవారితో కూడా ప్రమాదమేనని తేలింది. వీరంతా కరోనా వైరస్ క్యారియర్లుగా ఏపీలోకి ప్రవేశిస్తున్నారు, కరోనాని వ్యాప్తి చేస్తున్నారు.
ఏపీ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారితో ఆయా రాష్ట్రాల వారికి ముప్పులేదని మనం చెప్పలేం. ప్రయాణాల వల్లే ప్రజలు ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్లడం వల్లే కరోనా వ్యాప్తి చెందుతోందని తేలినా కూడా కేంద్రం నిబంధనలు సడలించడం సరికాదని అంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. అదే జరిగితే.. కరోనా మరింతగా విజృంభిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలకే అంతిమ ప్రాథాన్యం దక్కే అవకాశముంది.
కేంద్రం వరస చూస్తుంటే ఎలా ఉందంటే కొన్ని రోజులకు మల్టీప్లెక్సులు, బార్లకు కూడా అనుమతి ఇచ్చేలా ఉన్నారు. అన్ లాక్ 2.0 అంటూ మోడీ చేస్తోంది కచ్చితంగా చేతులు దులుపుకునే వ్యవహారమే.