పాపం కోడెల గోరుచుట్టుపై రోకలి పోటు

అసలే ముక్కిడి… ఆపై పడిశెం.. అన్నట్లుగా తయారైంది మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పరిస్థితి. నేను ఏ తప్పూ చేయలేదు అని ఆయన ఒకవైపు మొత్తుకుంటూ…  ఫర్నిచర్ దొంగలాగా చూడవద్దు అంటూ లబోదిబోమంటున్నారు. జనం…

అసలే ముక్కిడి… ఆపై పడిశెం.. అన్నట్లుగా తయారైంది మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పరిస్థితి. నేను ఏ తప్పూ చేయలేదు అని ఆయన ఒకవైపు మొత్తుకుంటూ…  ఫర్నిచర్ దొంగలాగా చూడవద్దు అంటూ లబోదిబోమంటున్నారు. జనం ఆయన మాటలను పూర్తిగా పరిగణనలోకి తీసుకోవడానికి ముందే.. ఆయనకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కుమారుడు శివరాంకు చెందిన హీరో మోటార్ డీలర్ షిప్ రద్దుఅయ్యేలా ఆర్టిఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

హైదరాబాదు అసెంబ్లీ నుంచి తరలించిన నిజాం కాలంనాటి అత్యంత విలువైన ఫర్నిచర్, కంప్యూటర్లను కోడెల శివప్రసాదరావు తన సొంతానికి వాడుకుంటూ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఫర్నిచర్ విషయంలో పరువు మొత్తం గంగపాలు అయిపోయాక… పోలీసు కేసులు కూడా నమోదు అయిన తరువాత కోడెల శివప్రసాదరావు మేల్కొన్నారు. నేను ముందు నుంచి ఫర్నిచర్ తీసుకోమన్నా, వారు పట్టించుకోలేదు అంటూ ఎదురుదాడికి దిగారు. కోర్టులో కేసు కూడా వేశారు. ఈలోగా పోలీసుల సహాయంతో అసెంబ్లీ అధికారులు వెళ్లి ఫర్నిచర్ తిరిగి తీసుకువచ్చారు.

తమాషా ఏంటంటే… హైదరాబాద్ నుంచి తరలిన ఆ ఫర్నిచరు మొత్తం, కోడెల చెబుతున్న ప్రకారం ఆయన క్యాంపు ఆఫీసులో ఉండాలి. కానీ అలా జరగలేదు. ఆయన కొడుకు శివరాం నిర్వహిస్తున్న హోండా షో రూమ్ లో దొరికాయి. అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నాక, సహజంగానే షోరూంను సీజ్ చేశారు. షోరూం సీజ్ చేయడం అక్రమం అంటూ కోడెల శివరాం మరో పిటిషన్ దాఖలు చేశారు.

ఇదిలా నడుస్తూ ఉండగానే, అసలు షోరూం లైసెన్సులు ఆర్టీఏ అధికారులు రద్దుచేశారు. నిబంధనలకు విరుద్ధంగా నాలుగు వాహనాలు అమ్మారంటూ కేసుపెట్టారు. వీరికి రద్దు చేయాల్సిందిగా హోండా సంస్థ కూడా నివేదిక పంపించారు. అటు అక్రమంగా తరలించిన ఫర్నిచర్ చేజారిపోగా, వ్యాపారం కూడా మూతపడటంతో కోడెల కుటుంబానికి గోరుచుట్టు మీద రోకటి పోటు పడినట్లుగా పరిస్థితి తయారైంది.

జనం విజ్ఞతను తక్కువగా చూస్తే పవన్‌కే నష్టం