కనీసం పది రోజులుగా విచ్చలవిడిగా చెలరేగుతున్న ఊహాగానాలకు జగన్మోహనరెడ్డి సర్కార్ ప్రాథమికంగా ఒక పుల్స్టాప్ పెట్టింది. అమరావతిలో రాజధాని నగరం ఉంటుందా? తరలిపోతుందా అనే సందేహాలు కొన్ని రోజులుగా చెలరేగుతూ ఉండగా, గురువారం నాడు సిఆర్ డిఏ సమీక్ష సమావేశాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశం అనంతరం మంత్రి బొత్స వెల్లడించిన వివరాలను బట్టి రాజధాని నగరాన్ని అమరావతి తరలించే అవకాశం లేదని అనిపిస్తోంది. ఈ విషయంలో ఇంతకుమించి ఊహాగానం చాలు జరగవలసిన అవసరం లేదు.
అమరావతిలో రాజధాని నగరం నిర్మాణం అంటే ఖర్చు రెండు మూడింతలు పెరగవచ్చునని బొత్స సత్యనారాయణ కొన్నిరోజుల కిందట వ్యాఖ్యానించారు. అది మొదలుగా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజధాని నగరాన్ని అమరావతి నుంచి మరొకచోటకు తరలించడానికి ప్రయత్నిస్తున్నట్టు అనేకానేక పుకార్లు వెల్లువెత్తాయి. అమరావతిని దొనకొండలో పెడతారని కొందరు, కాదు కాదు, రాష్ట్రంలో నాలుగుచోట్ల నాలుగు రాజధాని నగరాన్ని అభివృద్ధి చేస్తారని మరికొందరు… ఇలా రక రకాలుగా ఎవరికి తోచిన వ్యాఖ్యలు చేశారు.
సందట్లో సడేమియా అన్నట్లుగా రియల్ ఎస్టేట్ దళారీలు కూడా తమ విశ్వరూపం చూపించడం ప్రారంభించారు. ఇదిగో రాజధాని ఇక్కడికి వచ్చేస్తోంది అంటూ… ప్రతిచోటా దందాలు సాగించడానికి ప్రయత్నించారు. దాదాపు అన్ని పార్టీలకు చెందిన నాయకులు కూడా రాజధాని గురించి చెలామణీ అవుతున్న పుకార్లను ఆధారం చేసుకుని జగన్ ప్రభుత్వం నిందించడం షురూచేశారు. రాజధానిని తరలించడం అక్రమమని, తగదు అని, జగన్ అరాచకంగా వ్యవహరిస్తున్నాడని… ఎవరికి తోచిన విధంగా వారు సుద్దులు చెప్పడం ప్రారంభించారు.
జగన్ మాత్రం తొలినుంచి ఈ పుకార్ల పట్ల ఏ విధంగానూ స్పందించలేదు. ఎట్టకేలకు సీఎం జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు సిఆర్డిఏపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించిన బొత్స ఖర్చు పెరుగుతుందని తానుచెప్పిన మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. రాజధాని మారుతుంది అని తాను ఎప్పుడూ చెప్పలేదని, అలా చెప్పినవారు పుట్టిన గురించి స్పందించేది లేదని అన్నారు. నిర్మాణ పనుల విషయంలో మాత్రం ఇప్పటికే 35 వేలకోట్ల రూపాయల విలువైన టెండర్లను రద్దుచేసి ఉన్న నేపథ్యంలో.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి త్వరలో నిర్ణయిస్తామని బొత్స ప్రకటించారు.
జగన్ సమీక్ష సమావేశంతో ఈ పుకార్లపై స్పష్టత వస్తుందని రెండురోజుల నుంచి అనుకుంటున్నదే. రాజధాని అనేంతవరకు ఇప్పుడు స్పష్టత వచ్చినట్లే. అయితే, పనులు ఎప్పుడు మొదలవుతాయి ఎంత బడ్జెట్ తో అప్పటికి పూర్తిచేయాలని అనుకుంటున్నారు అనేది వేచిచూడాలి.