చాలా కాలంగా నవీన్ పోలిశెట్టి అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ మాటకు వస్తే అనుష్క అభిమానులు కూడా. ఇద్దరినీ విడివిడిగా స్క్రీన్ మీద చూసే చాలా కాలం అయింది. కలివిడిగా చూడడం అంటే మరీ ఆసక్తి. అలాంటి ఆసక్తి కలిగించిన మిస్ శెట్టి.. మిసెస్ పోలిశెట్టి సినిమా ఇదిగో.. అదిగో అంటూ అటు ఇటు జరుగుతూ వస్తోంది. ఆఖరికి విడుదల డేట్ వచ్చింది. ఆ మేరకు ట్రయిలర్ కూడా వచ్చేసింది.
ఇప్పటికే ఈ సినిమా ప్లాట్ జనాల్లోకి వచ్చేసింది. పెళ్లి వద్దు.. పిల్లలు ముద్దు అనుకునే అమ్మాయి, అందుకోసం ఎంచుకున్న కుర్రాడికి మధ్య జరిగే ఫన్, లవ్, రొమాంటిక్ డ్రామా. ఈ లవ్.. ఫన్.. రొమాన్స్ మూడూ క్లారిటీగా ట్రయిలర్ లోకి వచ్చాయి. నవీన్ మార్క్ డైలాగులు, అనుష్క మార్కు చమక్కులు, కలర్ ఫుల్ పిక్చరైజేషన్ కలిసి ట్రయిలర్ ను ఆసక్తికరంగా మార్చాయి. యూత్ మరీ కేరింతలు కాకున్నా, కాస్త హుషారయ్యే అనేక డైలాగులు ట్రయిలర్ లో పడ్డాయి. లైట్ లైట్ గా అడల్ట్ టచ్ వుందా.. లేదా అనేలా వున్నాయి.
సినిమాలో చివరకు కాస్త ఎమోషనల్ టచ్ ఏమన్నా వుంటుందేమో అనిపించేలా, ఆ జానర్ ను కూడా ట్రయిలర్ లో జస్ట్ అలా టచ్ చేసి వదిలారు. మొత్తం మీద ట్రయిలర్ అయితే సినిమా మీద ఆసక్తి పెంచేలాగే వుంది. ఆ మేరకు ట్రయిలర్ ను, కంటెంట్ ను అందించడంలో దర్శకుడు మహేష్ సక్సెస్ అయ్యారు. ఈ సినిమాకు నిర్మాతలు యువి క్రియేషన్స్.