వీకెండ్ బాక్సాఫీస్.. మళ్లీ జైలర్ దే హవా!

జైలర్ కు మరో వారం గ్యాప్ దొరికింది. గత శుక్రవారం రిలీజైన సినిమాలేవీ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో, రజనీ నటించిన జైలర్ సినిమా థియేటర్లలో స్థిరంగా కొనసాగే అవకాశం దక్కింది. నిన్నటి ఆదివారం రోజున…

జైలర్ కు మరో వారం గ్యాప్ దొరికింది. గత శుక్రవారం రిలీజైన సినిమాలేవీ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో, రజనీ నటించిన జైలర్ సినిమా థియేటర్లలో స్థిరంగా కొనసాగే అవకాశం దక్కింది. నిన్నటి ఆదివారం రోజున కూడా కొత్త సినిమాల కంటే, జైలర్ కే ఎక్కువ వసూళ్లు వచ్చాయి.

గత వారం మిస్టర్ ప్రెగ్నెంట్, ప్రేమ్ కుమార్ లాంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో ప్రేమ్ కుమార్ మూవీ వాష్ అవుట్ అయింది. మంచి లైన్ తీసుకొని, దాన్ని చెత్త స్క్రీన్ ప్లే, పసలేని క్యారెక్టరైజేషన్లతో చుట్టేయడంతో ప్రేమ్ కుమార్ మెప్పించలేకపోయాడు. అలా ఫస్ట్ వీకెండ్ గడిచేసరికి, హీరో సంతోష్ శోభన్ మరో ఫ్లాప్ చవిచూడాల్సి వచ్చింది.

ఇక మిస్టర్ ప్రెగ్నెంట్ ది మరో కథ. పురుషుడు గర్భం దాల్చడం అనే కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీలో సయ్యద్ సోహెల్ హీరోగా నటించాడు. సినిమాను అక్కడక్కడ ఎమోషనల్ గా నడిపించినప్పటికీ, పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది ఈ మూవీ. ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు డీసెంట్ గా ఉన్నప్పటికీ, లాంగ్ రన్ లో ఇది నిలబడుతుందనే గ్యారెంటీ లేదు.

వీటితో పాటు వచ్చిన పిజ్జా-3 సినిమా విడుదల రోజే ఫ్లాప్ అయింది. సూపర్ హిట్ టైటిల్ తో, రొటీన్ రివెంజ్ డ్రామాను చూపించారు. ఇలా గత శుక్రవారం రిలీజైన సినిమాల్లో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో, జైలర్ కు బాక్సాఫీస్ బరిలో మరో వారం అదనంగా లభించింది.

రిలీజైన మొదటి రోజు నుంచే తన పట్టు చూపించిన జైలర్ సినిమా, శని-ఆదివారాలు కూడా స్థిరంగా వసూళ్లు సాధించింది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గ్రాస్ లో 500 కోట్ల రూపాయల క్లబ్ లో చేరిన ఈ మూవీ, కలెక్షన్లలో తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రికార్డు సృష్టించే దిశగా దూసుకుపోతోంది.