మెగా కాంపౌండ్ నుంచి ఇప్పటికే ఓ మహిళా నిర్మాత ఉన్నారు. చిరంజీవి కుమార్తె సుశ్మిత నిర్మాతగా పలు వెబ్ సిరీస్ లు తీయడంతో పాటు, సినిమా కూడా నిర్మించాడు. ఇప్పుడిదే కాంపౌండ్ నుంచి మరో మహిళా నిర్మాత రాబోతోంది. ఆమె పేరు నిహారిక కొణెదల.
నిహారిక ఇప్పటికే తనకంటూ ఓ సొంత బ్యానర్ ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ బ్యానర్ పై ఆమె ఓటీటీకి కంటెంట్ అందిస్తున్నారు. ఆల్రెడీ జీ5కు కంటెంట్ ఇచ్చారు. త్వరలోనే సోనీ లివ్, అమెజాన్ కూడా ఒరిజినల్స్ ఇవ్వబోతున్నారు. ఇప్పుడీ ఔత్సాహిక నిర్మాత సినిమా కూడా నిర్మిస్తానని ప్రకటించింది.
“పింక్ ఎలిఫెంట్ స్థాపించాను. ప్రస్తుతం ఓటీటీ కోసం మాత్రమే వర్క్ చేస్తున్నాం. సోనీ లివ్ కు ఓ ప్రాజెక్ట్ పూర్తిచేశాం. త్వరలోనే అమెజాన్ కు ఒకటి చేయబోతున్నాం. ఇంకా చాలా పైప్ లైన్లో ఉన్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ఓ సినిమా కూడా నిర్మించబోతున్నాను.”
ఇలా తను సినీరంగంలోకి నిర్మాతగా అడుగుపెట్టబోతున్న విషయాన్ని నిహారిక ప్రకటించింది. మెగా తనయ సుశ్మిత ముందుగా చిన్న సినిమా తీశారు. ఇప్పుడు మెగాస్టార్ తో సినిమాను నిర్మించబోతున్నారు. నిహారిక కూడా ఇదే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.
ముందుగా లో-బడ్జెట్ లో ఓ సినిమా నిర్మించి, రిలీజ్ చేసిన తర్వాత, ఆ అనుభవంతో మెగా హీరోతో సినిమా ప్లాన్ చేయాలని అనుకుంటోంది. మెగా కాంపౌండ్ లో చాలామంది హీరోలున్నారు కాబట్టి, నిహారికకు హీరోలతో సమస్య లేదు. అనుకుంటే ఆమె ఇప్పటికిప్పుడు సినిమా నిర్మించొచ్చు. బన్నీ, చరణ్ లాంటి హీరోలు ఉన్నఫలంగా కాల్షీట్లు సర్దుబాటు చేయలేకపోవచ్చేమో కానీ.. అల్లు శిరీశ్, వైష్ణవ్ తేజ్ లాంటి హీరోలు ఈ కాంపౌండ్ లో ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు.