పొత్తుల సంగతేమో కానీ జనసేన నేతల జోరు మాత్రం మామూలుగా లేదు అని అంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని నర్శీపట్నం రాజకీయంగా ప్రాముఖ్యత కలిగినది. ఇక్కడ నుంచి మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత తొమ్మిది సార్లు పోటీ చేసి ఆరు సార్లు గెలిచారు. అందులో అయిదు సార్లు మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. పదవసారి 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి అయ్యన్నపాత్రుడు పోటీ చేయాలని చూస్తున్నారు.
అయ్యన్నకు వైసీపీ నుంచే గట్టి పోటీ ఉంది అనుకుంటే మిత్రపక్షమో శత్రుపక్షమో తెలియని జనసేన నుంచి కూడా తీవ్ర స్థాయిలో పోటీ ఉంటుందని సంకేతాలు కనిపిస్తున్నాయి. జనసేన చాప కింద నీరులా ఈ నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేసుకుంటోంది. ఆ పార్టీ నేతలు దూకుడుగా రాజకీయం చేస్తున్నారు.
ప్రభుత్వం మీద విమర్శలు చేయడంతో పాటు ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. ఇతర పార్టీల నుంచి కార్యకర్తలను తమ వైపునకు తిప్పుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభంజనం ఖాయమని నర్శీపట్నం జనసేన నేతలు అంటున్నారు. నర్శీపట్నంలో జనసేన బలోపేతం అయింది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పొత్తులు అయితే ఈ రోజు దాకా అఫీషియల్ గా జనసేన ఏ పార్టీతో పెట్టుకోలేదు. ఆ పార్టీ నేతలు అయితే అన్ని చోట్లా పోటీకి సిద్ధమని అంటున్నారు. నర్శీపట్నంలో తాము బలంగా ఉన్నామని ప్రకటిస్తున్నారు. పొత్తులు కుదరకపోతే జనసేనతోనే కొంప మునిగే పరిస్థితి ఉంటుందని తమ్ముళ్ళు తల్లడిల్లుతున్నారు.
ఒక వేళ పొత్తులు కుదిరినా జనసేన నుంచి సహకారం అంది ఓట్ల బదిలీ జరగాల్సి ఉంది. ఇపుడు చూస్తే టీడీపీకి కీలకమైన నియోజకవర్గంలోనే పక్కలో బల్లెంగా జనసేన ఉందని అంటున్నారు. జనసేన బలోపేతం కావడం అంటే వైసీపీకి కాదు టీడీపీకే డేంజర్ సిగ్నల్స్ అన్న అంచనాలూ ఉన్నాయి.