విజయనగరానికి తొమ్మిది పదేళ్ళ క్రితం ఒక హామీ లభించింది. అయితే అది ఆచరణలో అమలు కావడానికి చాలా సమయం తీసుకుంటోంది. విజయనగరానికి కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయాన్ని కేంద్రం విభజన హామీలలో భాగంగా కేటాయించింది.
ప్రస్తుతం మాత్రం అద్దె భవనాలలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం నడుస్తోంది. ప్రతీ కేంద్ర బడ్జెట్ లో అరకొర నిధులనే కేటాయిస్తూ వస్తున్నారు. ఈ నేపధ్యంలో శాశ్వత భవనాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ నెల 25న విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన గిరిజన వర్శిటీకి శంకుస్థాపన చేస్తారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. శంకుస్థాపనతో అడుగులు ముందుకు వేస్తున్న ఈ వర్శిటీకి పెద్ద ఎత్తున నిధులను కేంద్రం కేటాయించి త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రస్తుతం కేంద్రం ఏటా బడ్జెట్ లో విడుదల చేస్తున్న నిధులు సిబ్బంది జీతాలకే సరిపోతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూమిలో అద్భుతమైన భవన సముదాయాలకు నిధులు ఇచ్చి కేంద్రం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరుతున్నారు.
విజయనగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో జగన్ ఈ సందర్భంగా పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. జగన్ వచ్చే నెలలో శ్రీకాకుళం జిల్లాలో మరికొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు తాజాగా జగన్ టూర్ లో విశాఖ లో మకాం గురించి కూడా ప్రకటించే అవకాశం ఉంది అంటున్నారు.