బాలీవుడ్ అలనాటి సూపర్ స్టార్ ధర్మేంద్ర తనయుడు సన్నీ డియోల్ కూడా ఒకప్పటి స్టారే. తండ్రి నటనా వారసత్వాన్ని కొనసాగిస్తూ కెరీర్ లో కొన్ని సూపర్ హిట్స్ ను కలిగిన సన్నీ ప్రస్తుతం గదర్-2 సూపర్ హిట్ అయిన ఉత్సాహంతో ఉన్నాడు! ఊహకు అందని రీతిలో గదర్-2 సూపర్ హిట్ అయ్యింది. ఏదో గదర్ సినిమా పేరును క్యాష్ చేసుకోవడానికి తీసిన బాపతు అనుకుంటే.. ఈ సినిమా వందల కోట్ల వసూళ్లను సాధిస్తోంది. లేటు వయసులో ధర్మేంద్ర తనయుడు ఇలా సూపర్ హిట్ కొట్టాడు.
ప్రస్తుతం తన సినిమా ప్రమోషన్స్ కోసం విదేశాల్లో తిరుగుతున్న సన్నీ విషయంలో ముంబైలోని జుహూ ఏరియాలో తనకు సంబంధించిన విలువైన విల్లా వేలానికి వచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాకు సన్నీ 55 కోట్ల మేరకు బకాయి పడ్డాడని, ఈ నేపథ్యంలో తాకట్టులో ఉన్న అతడి విల్లాను వేలం వేసి బ్యాంకు అప్పును జమ చేసుకోనున్నట్టుగా ప్రకటన వచ్చింది.
ధర్మేంద్ర తనయుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడా.. అంటూ అంతా ఆశ్చర్యపోయారు. సన్నీ, బాబీ డియోల్ ను సినీ ప్రియులు చాలా వరకూ మరిచిపోయారు. పది పన్నెండేళ్ల కిందట వీరి సినిమాలు వచ్చినప్పుడు కాస్త హడావుడి ఉండేది. అయితే ఆ తర్వాత వీరి కథ ఇంగువ కట్టిన గుడ్డల్లాగానే మిగిలింది.
ధర్మేంద్ర తనయులు, గతంలో హిట్స్ తీసిన వారసులు.. అనే ట్యాగ్ మిగిలింది. దీంతో ఒకవేళ ఆర్థికపరమైన ఇబ్బందులతో వీరి ఆస్తులు వేలానికి వచ్చినా పెద్ద ఆశ్చర్యం లేదనుకోనే వారు చాలా మంది. అయితే గదర్-2 ఏకంగా వందల కోట్ల వసూళ్లు అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇతడి విల్లా వేలానికి అంటే ఆశ్చర్యం వ్యక్తం అయ్యింది.
అయితే.. బ్యాంక్ ఆఫ్ బరోడా ఆ ప్రకటనను వెనక్కు తీసుకుందట. టెక్నికల్ రీజన్స్ తో విల్లా వేలం ప్రకటనను ఆ బ్యాంకు వెనక్కు తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ హీరోనేమో ప్రస్తుతం తన సినిమా ప్రచారంలో భాగంగా లండన్ లో ఉన్నాడట. ఒకవేళ సన్నీ విల్లా వేలం వరకూ వచ్చి ఉన్నా.. ప్రస్తుతం అతడి సినిమా ఊపు మీద ఉండటంతో, డబ్బులు రీ పే చేసే శక్తి వచ్చి ఉండవచ్చు. ఒకవైపు గదర్-2 సూపర్ హిట్ కావడంతో, సన్నీ నటించిన బోర్డర్ సినిమాకు కూడా సీక్వెల్ వార్తలు వస్తున్నాయి మరి!