తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో కొత్త సభ్యుల నియామక ప్రక్రియ ఊపందుకున్నట్టుగా తెలుస్తోంది. కొత్త బోర్డులో స్థానం గురించి కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. అనేకమంది ఆ బోర్డులో స్థానం కోసం ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. ఆ స్థానం కోసం కొందరు ప్రముఖులు తమ పేర్లను తామే లీక్ ఇచ్చుకుంటున్నారని కూడా తెలుస్తోంది.
పక్క రాష్ట్రాలకు చెందిన వారికి కూడా అవకాశం దొరకనుండటంతో ఆసక్తిదాయకమైన పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. మొత్తం 15 మంది సభ్యులు ఉండే అవకాశం ఉన్న బోర్డులో ఏపీ కోటాలో కొందరు ఎమ్మెల్యేలు ఉండనున్నారని తెలుస్తోంది.
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, యూవీ రమణమూర్తి రాజు పేర్లు వినిపిస్తున్నాయి. ఇక తుడా చైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీటీడీలో కూడా స్థానం సంపాదించుకున్నట్టే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి పేరు జాబితాలో ఖరారు అయినట్టుగా సమాచారం.
తెలంగాణ కోటాలో జూపల్లి రామేశ్వరరావు పేరుకు సీఎం జగన్ నుంచి ఆమోదముద్ర లభించిందని, తమిళనాడు కోటాలో ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ కు చోటు దక్కవచ్చని తెలుస్తోంది. కర్ణాటక నుంచి కృపేందర్ రెడ్డి, సుందర్ అనే వ్యక్తుల పేర్లు వినిపిస్తున్నాయి. అతి త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావొచ్చు.