సాహో సినిమాకు సంబంధించి ఆది నుంచి వినిపిస్తున్న విమర్శ ఇది. ఈ సినిమాలో తెలుగు ఆర్టిస్టుల కంటే హిందీ జనాలే ఎక్కువగా కనిపిస్తున్నారని, దీనివల్ల నేటివిటీ ఫీల్ తగ్గిపోయిందనేది ప్రధాన విమర్శ. మొన్నటివరకు ఈ కామెంట్ ను తొక్కిపెట్టే ప్రయత్నం చేసింది యూనిట్. ఫైనల్ గా రిలీజ్ కు కొన్నిగంటల ముందు దీనిపై స్వయంగా ప్రభాస్ క్లారిటీ ఇచ్చాడు.
“చాలా తెలుగు సినిమాల్లో హిందీ ఆర్టిస్టులు నటిస్తున్నారు కదా. సాహోలో హిందీ ఆర్టిస్టుల్ని ఎక్కువ మందిని పెట్టారనేది చిన్న డిస్కషన్ మాత్రమే. చాలా తెలుగు సినిమాల్లో హిందీ ఆర్టిస్టులున్నారు. కాకపోతే సాహోలో ఎక్కువమంది హిందీ స్టార్లు కనిపిస్తారు. రెగ్యులర్ తెలుగు సినిమాతో పోలిస్తే ఓ 10శాతం ఎక్కువమంది ఉండొచ్చు. 2-3 భాషల్లో వస్తున్న సినిమా కావడంతో ఈమాత్రం తప్పనిసరి.”
ఈసారి బాలీవుడ్ ను కూడా టార్గెట్ చేయడంతో హిందీ ఆర్టిస్టుల్ని ఎక్కువమందిని తీసుకోక తప్పలేదన్నాడు ప్రభాస్. అయితే హిందీ నటీనటులు లేకుండానే బాహుబలి-2 పెద్ద హిట్ అయిందనే విషయాన్ని ప్రభాస్ మరిచిపోయినట్టున్నాడు. ఇక బడ్జెట్ విషయానికొస్తే.. కేవలం 2 యాక్షన్ ఎపిసోడ్స్ కోసమే అటుఇటుగా 90 కోట్లు చేశామంటున్నాడు.
“ఓ యాక్షన్ సీన్ కోసం 3 కార్లు తయారుచేశాం. అందులో 2 క్రాష్ చేయడానికి, ఇంకొకటి వాడకం కోసం తయారుచేశాం. వాటికే 3 కోట్లు ఖర్చు అయింది. ఈ కార్లు వాడి తీసిన 3 నిమిషాల యాక్షన్ సీన్ కు 16 కోట్లు ఖర్చు అయింది. క్లైమాక్స్ లో వచ్చే 12 నిమిషాల యాక్షన్ బ్లాక్ కు 70 కోట్లు ఖర్చు అయింది. కెన్నీ బేట్స్ తీసిన యాక్షన్ సన్నివేశాలకే ఎక్కువ బడ్జెట్ అయింది.”
బాహుబలి టైపులో సాహో కోసం తను ఎక్కువగా శిక్షణ తీసుకోలేదంటున్నాడు ప్రభాస్. కేవలం కొన్ని బైక్ సీన్స్, గాల్లో ఎగిరే మరికొన్ని సన్నివేశాల కోసం మాత్రమే కొన్నిరోజులు ట్రైనింగ్ తీసుకున్నానని స్పష్టంచేశాడు. తనకంటే టెక్నికల్ టీమ్ ఎక్కువగా కష్టపడిందని చెప్పుకొచ్చాడు.
రేపు రిలీజ్ అవుతున్నప్పటికీ సినిమాకు సంబంధించి ఫస్ట్ రిపోర్ట్ ఈరోజు రాత్రికే బయటకు రాబోతోంది. దుబాయ్ లో సాహో మొట్టమొదటి షో పడబోతోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే భీమవరం, కర్నూలు లాంటి ప్రాంతాల్లో ఉదయం 5 గంటలకే షోలు ప్రారంభం కాబోతున్నాయి.