దూకుడుకు బ్రేక్ : దూసుకెళ్లాలంటే సంకోచం!

ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మూడునెలల్లో తొలిసారిగా జగన్ సర్కారు, కాస్త ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇన్నాళ్లూ ఏ విషయంలోనైనా చాలా దూకుడుగా నిర్ణయం తీసుకుంటూ వచ్చిన జగన్ సర్కారు.. తొలిసారిగా.. నెమ్మదించింది. పోలవరం రీటెండర్ల విషయంలో…

ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మూడునెలల్లో తొలిసారిగా జగన్ సర్కారు, కాస్త ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇన్నాళ్లూ ఏ విషయంలోనైనా చాలా దూకుడుగా నిర్ణయం తీసుకుంటూ వచ్చిన జగన్ సర్కారు.. తొలిసారిగా.. నెమ్మదించింది. పోలవరం రీటెండర్ల విషయంలో కొంత జాగుచేస్తోంది. రీటెండర్లకు నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టెండర్లను ఆన్‌లైన్ లో అప్‌డేట్ చేయడానికి ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం మరియు విద్యుత్తు ప్రాజెక్టు కాంట్రాక్టులను ప్రభుత్వం రద్దుచేసి నెల గడుస్తోంది. ఈ వివాదం కొంత ముదిరిన తర్వాత.. పోలవరం అథారిటీ కూడా దీనిపై అభ్యంతరాలు వ్యక్తంచేసిన తర్వాత.. ఏమాత్రం జాప్యం లేకుండా పనులు తిరిగి మొదలెట్టాలని జగన్ ఆదేశించారు. ఆయన అన్నట్లుగానే… అప్పటికి వారంరోజుల్లోనే పోలవరం రీటెండర్లకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఆ తర్వాతే అన్నిరకాల ఆటంకాలు మొదలయ్యాయి.

విద్యుత్తు ప్రాజెక్టు నుంచి తమను తప్పిస్తూ కాంట్రాక్టు రద్దు చేయడానికి ప్రభుత్వానికి అధికారం లేదంటూ.. నవయుగ సంస్థ హైకోర్టుకు వెళ్లింది. దీని మీద విచారణ సాగిన తర్వాత.. వారికి అనుకూలంగానే కోర్టు తీర్పు చెప్పింది. రీటెండరింగ్ ప్రక్రియ ఆపు చేయాలంది. ఈ తీర్పు మీద జెన్‌కో మళ్లీ కోర్టుకెక్కింది. నవయుగ వారు వేసిన పిటిషన్‌కు అసలు విచారణ అర్హతే లేదన్నది వారి వాదన. దీనిమీద విచారణ సెప్టెంబరు 4వ తేదీన జరిగే అవకాశం ఉంది. ఆ పిటిషన్ సంగతి తేలితే తప్ప.. ప్రభుత్వం టెండర్లను అప్‌లోడ్ చేసేలా కనిపించడం లేదు.

టెండరు ప్రకటనను అప్‌లోడ్ చేసిన తర్వాత… 21రోజులు గడువు ఉంటుంది. ఆలోగా దాఖలు చేయాలి. ప్రభుత్వం ప్రస్తుతానికి ఏదో సాంకేతిక కారణాల వల్ల అప్లోడ్ చేయలేదని, 4 తర్వాత చేస్తామని చెబుతోంది. వాస్తవంలో కోర్టు తీర్పు వచ్చేదాకా ఎదురుచూడాలని వారు అనుకుంటున్నట్లుంది. 4న విచారణ జరిగితే వెంటనే కోర్టు తీర్పు వస్తుందనుకోవడం భ్రమే.

విద్యుత్తు ప్రాజెక్టు సంగతి పక్కనపెట్టి ప్రధాన డ్యామ్ వరకు రీటెండరు పిలవడానికి ఇబ్బందిలేదు. అలా జరిగితే.. నవయుగ విజయాన్ని తాము ఆమోదించినట్లు అవుతుందనే ఇంప్రెషన్ వస్తుందని.. ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుంది. ఏది ఏమైనా.. పనుల్లో జాప్యం మాత్రం అనివార్యం అయ్యేలాగానే కనిపిస్తోంది.

జనం విజ్ఞతను తక్కువగా చూస్తే పవన్‌కే నష్టం