మొదటికే మోసం: జగన్ పార్టీలో టీడీపీ సంస్కృతి

తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయానికి బలమైన కారణాల్లో ఒకటి ఇంచార్జి పాలన. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఎమ్మెల్యేలు మొహం చాటేసి, తన నియోజకవర్గాల్లో ఇంచార్జీలను నియమించి పాలన సాగించారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు..…

తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయానికి బలమైన కారణాల్లో ఒకటి ఇంచార్జి పాలన. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఎమ్మెల్యేలు మొహం చాటేసి, తన నియోజకవర్గాల్లో ఇంచార్జీలను నియమించి పాలన సాగించారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఇలా చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు అధికారం చలాయించారు. ఫలితంగా గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడీ చెత్త సంస్కృతి వైసీపీలో కనిపిస్తోంది.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమంది నేతలు నియోజకవర్గాలకు రావడం మానేశారు. తమ తరఫున ఇంచార్జీల్ని నియమించి పాలించారు. వాళ్లు మాత్రం తమ సొంత వ్యాపారాలు చూసుకున్నారు. చంద్రబాబు చుట్టూ తిరిగి తరించారు. దీనివల్ల స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో ఓడిపోవడానికి ఇది కూడా ఓ ప్రధాన కారణం. ఇప్పుడు వైసీపీలో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇదే పద్ధతి అనుసరిస్తున్నారు.

రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు రావడం తగ్గించేశారు. తమ తరపున ప్రతినిధుల్ని నియమించి, సమస్యలు ఏమైనా ఉంటే వాళ్లకు చెప్పాలని సూచిస్తున్నారు. మంత్రులకు పనిభారం కాస్త ఉంటుంది కాబట్టి వాళ్లు తమ నియోజకవర్గాలపై పెద్దగా దృష్టి పెట్టలేకపోతున్నారని అనుకోవచ్చు. కానీ మిగతా ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాలపై దృష్టి పెట్టకపోతే ఎలా?

వైసీపీ అధికారంలోకి వచ్చి 4 నెలలైనా పూర్తికాకముందే కొంతమంది ఎమ్మెల్యేలు ఇలా ప్రజలకు ముఖం చాటేయడం బాధాకరం. మరీ ముఖ్యంగా గ్రామ సచివాలయాల ఏర్పాట్లు, రేషన్ సరఫరాలో మార్పుచేర్పులు జరుగుతున్న ఈ సమయంలో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కానీ ఓ ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రం నియోజకర్గాలకు దూరంగా ఉంటున్నారు. పథకాల అమలుపై ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన ఈ సమయంలో సొంత వ్యాపారాలు చూసుకుంటున్నారు. ప్రస్తుతం నవరత్నాలపైనే పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఎమ్మెల్యేల పనితీరుపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టలేకపోతున్నారు. సీఎం బిజీగా ఉండడం వీళ్లకు వరంగా మారింది.

కానీ ఏదో ఒకరోజు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలపై దృష్టిపెడతారు. అప్పటివరకు వ్యవహారాన్ని తీసుకురాకుండా, ఈలోగా వైసీపీ ఎమ్మెల్యేలంతా కాస్త జాగ్రత్తపడితే మంచిది. టీడీపీకి చెడ్డపేరు తీసుకొచ్చిన ఈ “ఇంచార్జి పాలన” సంస్కృతి, వైసీపీకి విస్తరించకుండా ఉంటే అందరికీ మంచిది. 

జనం విజ్ఞతను తక్కువగా చూస్తే పవన్‌కే నష్టం