హమ్మయ్య ఒక్కరైనా ప్రాక్టికల్ గా మాట్లాడారు!

రాజధాని అనేది అమరావతిలో ఉంటుందా లేదా? అనే విషయంలో గత కొన్నిరోజులుగా విపరీతమైన రాద్ధాంతం జరుగుతోంది. నాయకులు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. పార్టీలు.. ఈ అంశాన్ని ఎంత పెద్దదిగా సృష్టించి.. మాట్లాడుతూ ఉంటే అంతగా…

రాజధాని అనేది అమరావతిలో ఉంటుందా లేదా? అనే విషయంలో గత కొన్నిరోజులుగా విపరీతమైన రాద్ధాంతం జరుగుతోంది. నాయకులు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. పార్టీలు.. ఈ అంశాన్ని ఎంత పెద్దదిగా సృష్టించి.. మాట్లాడుతూ ఉంటే అంతగా తమకు రాజకీయ లబ్ధి దొరుకుతుందనే దుగ్ధతో సాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ వివాదం గురించి.. ఇన్నాళ్లకు ఒక్కరు మాత్రం ప్రాక్టికల్‌గా మాట్లాడారు. ఈ ప్రచారాలన్నీ ఊహాగానాలే అని కొట్టిపారేశారు. ఆయన ఏపీ అసెంబ్లీ స్పీకరు తమ్మినేని సీతారాం.

ఢిల్లీలో స్పీకర్ల సదస్సుకు హాజరైన తమ్మినేని సీతారాం.. అనంతరం ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు విలేకర్ల రాజధాని రగడ గురించి కూడా అడిగారు. దీనికి ఆయన సూటిగా ‘రాజధాని మారుతుందని ఎవరు చెప్పారు? సీఎం చెప్పారా?’ అంటూ ప్రశ్నించారు. కొన్ని అపోహలను సృష్టించుకుని, వాటితో ముడిపెట్టి అందరూ రాద్ధాంతం చేస్తున్నారంటూ కొట్టిపారేశారు. శివరామకృష్ణన్ కమిటీ ప్రస్తావించిన లోపాలను బొత్స సత్యనారాయణ ఉటంకించారే తప్ప రాజధాని తరలించాలని అనలేదని కూడా గుర్తుచేశారు.

ఒకరకంగా చూసినప్పుడు అది కూడా నిజమే. బొత్స సత్యనారాయణ వ్యయం గురించి మాత్రమే మాట్లాడారు. అక్కడినుంచి అధికార-విపక్ష నాయకులందరూ కూడా ఎవరికి తోచిన రీతిలో వారు మాట్లాడుతూ.. ఎడాపెడా కొత్త పుకార్లు పుట్టడానికి దోహదం చేస్తున్నారు. ప్రజలకు గందరగోళం తప్పడంలేదు. ఊహాజనితమైన విషయాల మీదనే… అంతా సాగుతున్నట్లుగా కనిపిస్తోంది. కనీసం స్పీకరైనా.. ప్రాక్టికల్‌గా సమస్యను విశ్లేషిస్తూ మాట్లాడడం గమనార్హం.

ఈ నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి అమరావతిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. సాధ్యాసాధ్యాలు, వ్యయం, ఏ రకంగా ముందుకు వెళ్లగలమనే పరిస్థితిపై అంచనాకు రావడం… ఇవన్నీ ఇవాళ జగన్ నిర్వహించే ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో చర్చకు వస్తాయి. సాయంత్రానికి నిర్ణయాలు కూడా వెలువడవచ్చు. స్వయంగా జగన్ నోటమ్మట ప్రకటన వెలువడితే గానీ.. అమరాతి రాజధానికి అనుకూలంగానో, ప్రతికూలంగానో.. రోజుకో రకంగా సాగుతున్న ప్రచారాలకు ఫుల్ స్టాప్ పడే అవకాశం లేదు.

జనం విజ్ఞతను తక్కువగా చూస్తే పవన్‌కే నష్టం