ముందే సిద్ధం అవుతున్న గులాబీలు

తెలంగాణలో అధికార తెరాస… తతిమ్మా అన్ని పార్టీలకంటె ముందుగానే  మునిసిపల్ ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… పార్లమెంటు నియోజకవర్గాల వారీగా… పురపాలక ఎన్నికల బాధ్యతను…

తెలంగాణలో అధికార తెరాస… తతిమ్మా అన్ని పార్టీలకంటె ముందుగానే  మునిసిపల్ ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… పార్లమెంటు నియోజకవర్గాల వారీగా… పురపాలక ఎన్నికల బాధ్యతను చూడాల్సిన ఇన్‌చార్జిలను కూడా నియమించారు. విపక్షాలను చిత్తుచేసి.. పురపాలికల్లో తెరాస విజయఢంకా మోగించాలని కేటీఆర్ పిలుపు ఇచ్చారు.

నిజానికి తెలంగాణలో పురపాలక ఎన్నికలు అనేవి… తెలంగాణ రాష్ట్ర సమితికి కత్తిమీద సాములాంటి వ్యవహారంగా కనిపిస్తోంది. ఆ పార్టీ.. గతంలో అసెంబ్లీని రద్దుచేసి… ఆరునెలలు ముందుగానే ఎన్నికలకు వెళ్లింది. ఆ ఎన్నికల్లో ఢంకా బజాయించి గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చింది. తెరాస సాధించిన అనూహ్యమైన మెజారిటీ ఒక మ్యాజిక్ అనే అంతా అనుకున్నారు. కాంగ్రెస్, తెదేపా అంతా కలిసి పోటీచేసి కూడా పరువు నిలుపుకోలేకపోయారు. దిగ్గజాలంతా ఓడిపోయారు. అయితే లోక్ సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెరాస, ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయింది. కేవలం 8 స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది.

తెలంగాణలో ప్రజలు తెలివి తెచ్చుకున్నారని, తెరాస పాలనకు చరమగీతం పాడడం మొదలైందని.. ఆ సమయంలో విపక్షాలన్నీ సహజంగానే విమర్శలు గుప్పించాయి. అయితే రాష్ట్ర పరిపాలనకు సంబంధించినవి కాదు గనుక.. ప్రజలు జాతీయ పార్టీలకు కొంతమేర మద్దతిచ్చి ఉండచ్చునని సమర్థించుకునే అవకాశం తెరాసకు చిక్కింది. ఈ రకంగా… రాష్ట్రంలో తమ పార్టీ ప్రాభవం పడిపోయిందేమో అని అనుమానిస్తున్న తరుణంలో మునిసిపల్ ఎన్నికలు వస్తున్నాయి. అందుకే తెరాస వీటిని చాలా సీరియస్‌గా తీసుకుంటోంది.

అన్ని పార్టీలకంటె ముందుగానే కేటీఆర్ పార్లమెంటుల వారీగా.. ఇన్‌చార్జుల్ని నియమించారు. నాయకుల్తో సమీక్షించి… వ్యూహరచన చేశారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇప్పటికి ప్రతిపక్షాలు బలపడ్డాయనే చెప్పాలి. ప్రధానంగాన భాజపా బాగా బలపడింది. చాలామంది నాయకులు ఇతర పార్టీల నుంచి వచ్చిచేరారు. పైగా మునిసిపాలిటీలంటే.. విద్యావంతులైన ఓటర్లు ఎక్కువగా ఉంటారనే అంచనాతో.. తమకు సానుకూలత ఉంటుందని భాజపా ఆశిస్తోంది.

ఇలాంటప్పుడు.. తెరాస తమ ప్రాభవాన్ని నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి. అసెంబ్లీ ఎన్నికల దామాషాలు నెగ్గుతారా… పార్లమెంటు ఎన్నికల దామాషాలో కిందికి పడుతారా? అనే దానిని బట్టి.. పార్టీ భవిష్యత్తు ఉంటుంది.

జనం విజ్ఞతను తక్కువగా చూస్తే పవన్‌కే నష్టం