రెండు వదిలేస్తే ఎలాగైనా బతికేయచ్చు అన్నది వెనకటికి సామెత. ఆ రెండూ ఏమిటన్నది అందరికీ తెలిసిందే.
ప్రభుత్వం ఏమీ పీకలేదు అనే ధైర్యం వచ్చేసింది. చార్జ్ షీట్ వేసినా వెంట్రుక కూడా ఊడలేదన్న నమ్మకం వచ్చేసింది. తమ వెనుక తమకు వుండాల్సిన పవర్ ఫుల్ దన్ను తమకు వుందనే ఆలోచన రాగానే మీడియా ఉచ్ఛనీచాలు మరిచిపోయేంత పూనకం వచ్చేసింది.
ఇక తామేం రాసినా తమ ఇష్టం అనేంత బరితెగింపు వచ్చేసింది. అందుకే అసలు తామేంటూ, తమ మీడియా ఏంటో, తమకు వున్న కట్టుబాట్లు ఏమిటో మరిచిపోయేంత మైకం కమ్మేసింది. ఎడాపెడా రాస్తున్నారు. చూస్తున్న జనం విస్తుపోతున్నారు. ఇలా ఎంత కాలం సాగుతుందో? మరి.
ఓ పాత సినిమా పాట పట్టుకుని, అచ్చం ఇప్పటి ప్రభుత్వ పోకడలకు అనుగుణంగా వుంది కదా అంటూ అచ్చోసి వదిలేసారు. ప్రభుత్వాన్ని ఎలాగైనా భ్రష్టు పట్టించాలి. జనాల్లో పలుచన చేయాలి. నిజానికి లక్షల సినిమా పాటలు వున్నాయి. ఓపిగ్గా వెదకాలే కానీ, వ్యక్తులకు, వ్యవస్థలకు, పాలకులకు, పాలనకు సరిపడా పాటలు బోలెడు దొరకుతాయి. రోజుకు ఒకటి అచ్చేసుకోవచ్చు.
కానీ ఒకటి మనం అవతల వాళ్ల గురించి ఏమనుకుంటున్నాం, ఏమని కలవరిస్తున్నాం అని మాత్రమే కాదు, అసలు చదువుతున్న జనం ఏం అనుకుంటున్నారు అని కూడా ఆలోచించుకుంటే బెటర్.
ఆస్తికుడి కన్నా నాస్తికుడే భగవంతుడిని ఎక్కువ తలుస్తాడట. భక్తి వున్న వాడికన్నా పగ వున్న వాడే ఎక్కువ కలవరిస్తాడు. ఇక్కడా అదే జరుగుతోందేమో?