ఉరిమి ఉరిమి మంగళంపై పడ్డ చందంగా… ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సినిమా వాళ్లపై పడ్డారు. వికాయక చవితి వేడుకల వివాదంలోకి సినిమా వాళ్లను కూడా లాగేందుకు ఆయన ప్రయత్నించడం గమనార్హం.
కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఏపీ ప్రభుత్వం వినాయక చవితికి ఆంక్షలు విధించడమే నేరమైంది. దీన్ని రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకు బీజేపీ చేయని ప్రయత్నమంటూ లేదు.
ఈ నేపథ్యంలో సోము వీర్రాజు తాజా ప్రకటన ఆశ్చర్యం కలిగిస్తోంది. వినాయక చవితి వేడుకల విషయంలో సినీ హీరోలు తమ గళా న్ని విప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సినిమా షూటింగ్స్ ప్రారంభానికి ముందు వినాయకుడికి టెంకాయలు కొట్టే వారు వేడుకల నిర్వహణ విషయంలో నోరు మెదపరా? అని సినీ రంగాన్ని ప్రశ్నించారు.
మెజార్టీ ప్రజల సెంటిమెంట్‌ను సినీ రంగం గౌరవించాలని ఆయన కోరారు. ఈ ప్రకటనలో బీజేపీ రాజకీయ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. సినీ హీరోలు జగన్ ప్రభుత్వంపై అసమ్మతి గళాన్ని వినిపిస్తే, వారి అభిమానులను తమ వైపు తిప్పుకోవచ్చని సోము వీర్రాజు ఎత్తుగడ వేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సినీ హీరో పవన్‌కల్యాణ్‌తో పొత్తు కుదుర్చుకున్న బీజేపీకి… ఇండస్ట్రీ నుంచి పెద్దగా సానుకూలత రావడం లేదు. దీంతో వారిని టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఇందుకు వినాయక చవితి వేడుకను వాడుకుంటోందని చెప్పొచ్చు. అయితే టాలీవుడ్ నటీనటులు, ఇతర విభాగాల ప్రతినిధులు కేవలం ప్రశంసలకే తప్ప విమర్శలకు ముందుకు రారనే విషయం వీర్రాజుకు తెలుసో లేదో మరి!