పీకే: వృద్ధనారీ పతివ్రతః డైలాగులు

శరీరాన్ని ఎరగా వేసి, వ్యాపారం చేసుకోగలిగినంత కాలమూ.. ఎంచక్కా హాయిగా వ్యాపారం చేసుకుని.. వయసుడిగి పోయిన తర్వాత.. వ్యాపారానికి బేరాలు తగ్గిపోయిన తరువాత.. పతివ్రత లక్షణాలు గురించి ఉపన్యాసం ఇస్తే ఎలా ఉంటుంది? అలాంటిది…

శరీరాన్ని ఎరగా వేసి, వ్యాపారం చేసుకోగలిగినంత కాలమూ.. ఎంచక్కా హాయిగా వ్యాపారం చేసుకుని.. వయసుడిగి పోయిన తర్వాత.. వ్యాపారానికి బేరాలు తగ్గిపోయిన తరువాత.. పతివ్రత లక్షణాలు గురించి ఉపన్యాసం ఇస్తే ఎలా ఉంటుంది? అలాంటిది చూస్తే ఎవరికైనా సరే కామెడీ అనిపిస్తుంది కదా? 

ప్రస్తుతం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాటలు కూడా ఈ వృద్ధనారీ పతివ్రతః సామెతనే గుర్తుకు తెస్తున్నాయి. తాను అప్పుడు అలా చేసి ఉండాల్సింది.. ఇప్పుడు ఇలా చేసి ఉండాల్సింది.. అంటూ సంభావ్యతల గురించి మాట్లాడుతూ ప్రశాంత్ కిషోర్ తనలోని అవకాశవాద వైఖరిని మరోమారు గట్టిగా చాటుకుంటున్నారు. 

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, బీహార్ సీఎం నితీష్ కుమార్ వంటి వారు తమ సొంత లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు తాను సాయపడటం కన్నా కాంగ్రెస్ పునరుజ్జీవనానికి కృషి చేసి ఉంటే చాలా బాగుండేదని ఇవాళ ప్రశాంత్ కిషోర్ సెలవిస్తున్నారు. మోడీని గద్దెపై కూర్చుండ పెట్టడానికి కూడా ఒక బేరం కుదుర్చుకొని పనిచేసిన అంతకంటే పాత రోజులను ఆయన మరిచిపోయినట్లుగా కనిపిస్తుంది. 

ఇప్పుడు జన సురాజ్ పేరుతో తనకంటూ ఒక సొంత దుకాణం పెట్టుకుని.. దానికి ప్రజాదరణ కూడగట్టే ప్రయత్నం.. కాంగ్రెస్తో అనుబంధాన్ని ముడి పెట్టే వ్యూహము అనుసరిస్తున్న ప్రశాంత్ కిషోర్ తాను గతంలో చేసిన వ్యాపారాలు.. కలిసి పనిచేసిన పార్టీల గురించి భిన్నాభిప్రాయం వచ్చేలా మాట్లాడడం ఘోరం. జగన్మోహన్ రెడ్డి తన సొంత లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ప్రశాంత్ కిషోర్ తాను రక్తం చిందించినట్లుగా చెప్పుకుంటున్నారు. నిజానికి ఆయన ఒక బేరం మాట్లాడుకుని కాంట్రాక్టు కూలి పని మాత్రమే చేశారు. ఆ మాత్రం దాని గురించి అప్పుడేదో సంఘోద్ధరణ చేసినట్టుగా బిల్డప్ ఇవ్వడం ఎందుకు? ఇది ప్రజల మదిలో మెదులుతున్న సందేహం!

భావజాలాలతో నిమిత్తం లేకుండా, ఆయా పార్టీల సిద్ధాంతాలతో సంబంధం లేకుండా.. తాను అడిగిన భారీ మొత్తం ఎవరు ఇస్తే వారికి అనుకూలంగా పనిచేయడం ప్రశాంత్ కిషోర్ లక్షణం! అదే ఆయన వ్యాపారం! దానిని తప్పు బట్టే అవసరం లేదు!! ప్రధానంగా ప్రాంతీయ పార్టీలతో.. ఒకరి భావజాలాలతో మరొకరికి ఏమాత్రం పొసగని పార్టీలకు కూడా విడివిడిగా పనిచేస్తూ వారిని అధికారంలోకి తీసుకురావడానికి.. ఆయన వందల కోట్ల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఉంటారనేది ప్రచారంలో ఉన్న సంగతి. అలా వ్యూహమే వ్యాపారంగా బతికే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఈ పశ్చాత్తాప వైఖరిని ప్రదర్శించడం కామెడీగా ఉంది.

తాజాగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆయన సరికొత్త డీల్ కుదుర్చుకుని ముందడుగు వేస్తున్నారని.. అందుకోసం అంగీకరించనందువల్లనే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అనుకోవాల్సి వస్తుంది. నిన్న చేసిన వ్యాపారం గురించి ఇవాళ పశ్చాత్తాపం డైలాగులు వల్లే వేస్తున్న ఈ పీకే.. ఇవాళ ఉన్న బుద్ధుల గురించి రేపు దేశం మరింతగా నాశనమైన తర్వాత మరోసారి పశ్చాత్తాపం వ్యక్తం చేసి చేతులు దులుపుకోడు అని గ్యారెంటీ ఏముంది?

చూడబోతే ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జనసురాజ్ పార్టీ గాని, ఆయన సాగిస్తున్న సుదీర్ఘమైన పాదయాత్ర గాని.. బీహార్ ప్రజల కోసం చేస్తున్నట్లుగా లేదు! తిమ్మిని బమ్మిని చేసి.. తనను కూడా ఒక రాజకీయ పార్టీ అధినేతగా ప్రొజెక్ట్ చేసుకుని.. మిగిలిన పార్టీలను కూడగట్టి కాంగ్రెస్ పల్లకి కోసం బోయిలుగా మార్చడమే ఆయన లక్ష్యం అనిపిస్తుంది! ముందు ముందు పీకే మరెన్ని సార్లు పశ్చాత్తాపపడతారో మనం వేచి చూడాలి.