అనుకున్నది జరగకపోతే.. ఎవరైనా సరే.. భయంకరమైన అసహనానికి గురవుతారు. ఆ అసహనంలో విచక్షణ కోల్పోతారు. సంయమనం కోల్పోయి మాట్లాడుతారు. ఆ మాటలతో మరిన్ని చిక్కులను సమస్యలను కొనితెచ్చుకుంటారు. ఇప్పుడు పొరుగుదేశం పాకిస్తాన్ పరిస్థితి కూడా అదేమాదిరిగా కనిపిస్తోంది.
ఆర్టికల్ 370 రద్దుపై భారత్ ను అందర్జాతీయ సమాజం ముందు దోషిగా చూపించి లబ్ధి పొందాలని అనుకున్న పాకిస్తాన్, ఆ ప్రయత్నం విఫలం అయ్యేసరికి అవాకులు చెవాకులు పేలుతోంది. యుద్ధం పొంచి ఉన్నదని బెదిరించే ప్రయత్నం చేస్తోంది. అయితే.. ఈ మాటలను బట్టి.. ఐరాసపై పాక్ ఆశలు వదులుకున్నట్లే కనిపిస్తోంది.
తాజా పరిణామాలను గమనిస్తే.. పాకిస్తాన్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్.. ఈ వ్యవహారానికి సంబంధించి అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం రావల్పిండిలోని ఓ సమావేశంలో మాట్లాడుతూ అక్టోబరు నవంబరు నెలల్లో భారత్ – పాకిస్తాన్ ల మధ్య పూర్తిస్థాయిలో యుద్ధం జరిగే అవకాశం ఉన్నదని సెలవిచ్చారు. ఇప్పటికే పాకిస్తాన్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. చెదరుమదురు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటిది యుద్ధం మాటెత్తడం అంటే.. పాక్ బరితెగిస్తున్నట్టే కనిపిస్తోంది.
అయితే ఇదే సమావేశంలో షేక్ రషీద్ మరికొన్ని మాటలు చెప్పారు. ‘‘కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలని అనుకుంటే.. ఐక్యరాజ్యసమితి ఈ సరికే అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి ఉండేది’’అని ఆయన అంటున్నారు. అంటే ఐరాస అలాంటి పని చేయకపోవడం వలన పాక్ ఎంత ఆగ్రహంగా ఉన్నదో రషీద్ మాటల్లో తెలుస్తోంది. ఈ గొడవ ముదిరిన తర్వాత.. ఐక్యరాజ్యసమితి జోక్యం చే సుకుని సమావేశం పెట్టాలని పాక్ కోరింది. ఐరాస పట్టించుకోకపోయేసరికి, చైనాతో వారికి సిఫారసు చేయించుకుంరది. ఐరాస చాలా మర్యాదగా కేవలం ‘ఇష్టాగోష్టి సమావేశం’ మాత్రం నిర్వహించింది. కాశ్మీర్ సమస్యపై అధికారిక సమావేశం జరపనేలేదు. పైగా ఈ సమస్య ద్వైపాక్షికమైనదని ఆరోజే ప్రకటించింది.
ఈ పరిణామాలు పాక్ కు మింగుడుపడలేదు. అసహనంతో వారు రగిలిపోతున్నారు. యుద్ధం అంటూ మొదలెడితే తమ గోతిని తామే తవ్వుకోవడం అవుతుందని తెలియకుండా… పాకిస్తాన్ ఇలాంటి ప్రకటనలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.