సినిమా తీయడానికి ఐడియా ఉంటే సరిపోదు..కథ, స్క్రీన్ ప్లే జాగ్రత్తగా రాసుకోవాలి.
రాజకీయంగా మాట్లాడడానికి పాయింట్ కనిపిస్తే చాలదు..విశ్లేషణాపటిమతో పాటూ ఆసక్తికరంగా చెప్పే నైపుణ్యం ఉండాలి.
సినీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కనుక పవన్ కళ్యాణ్ కి మొదటి దాని మీద అవగాహన ఉంది కానీ రెండో దాని మీద లేదు.
దీనికి రుజువేంటంటే ఆయన నటించిన సినిమాలు హిట్టయ్యాయి కానీ ఆయన స్పీచులు ఎప్పుడూ హిట్ కాలేదు.
చుట్టూ ఉన్న ఫ్యాన్స్ ఈలలు కొట్టడానికి సామెతలు, పంచ్ డయలాగులు కొట్టడం తప్పించి విషయం మాట్లాడి జనం మనసుల్ని గెలుచుకున్న సందర్భం దాదాపు లేదు.
అందుకే అధిక శాతం ఓటర్స్ కి ఆయన దగ్గర కాలేకపోతున్నాడు.
తాజాగా ఒక వీడియో వదిలారు. ప్రశ్న అడిగిన వ్యక్తి ఫ్రేములో కనిపించలేదు. బహుశా తన పక్కన ఫ్రేములో కనపడడానికి అర్హత కావాలేమో. భీంలా నాయక్ పోస్టర్లో రాణాకే ఆ ఆర్హత లేదు ఇక సామాన్య ఇంటర్వ్యూవర్ కి ఏముంటుంది పాపం?
ఇంతకీ ఆ వీడియోలో ప్రధానంగా రెండు ప్రశ్నలు వినిపిస్తాయి. ఒకటి ఆ.ప్ర రోడ్ల గురించి, రెండోది అదే రాష్ట్రంలో వినాయకచవితి పండుగను ఇళ్లకే పరిమితం చేస్తూ విడుదల చేసిన జీవో గురించి.
రోడ్ల గురించి జవాబు చెప్తూ వెక్కిరింపులు, సెటైర్లు విసరడం..వినాయకచవితి ఉత్సవాలకి సంబంధించి స్పందిస్తూ మతం రంగు పులమడం పవన్ కళ్యాణ్ చేసిన పని.
సరే..రాజకీయంలో ఏం చేసినా, ఎలా మాట్లాడినా ఓకే. కానీ మ్యాటర్ ఏదైనా చెప్పే విధానంలో పవర్ ఉండాలి కదా. ఈయనకి బిరుదులోనే పవర్ తప్ప పలుకులో లేదు. పాలకపక్ష పక్షపాతుల గుండెల్లో గుద్దినట్టు మాట్లాడాలి కానీ ఏదో పైపైన దులుపుతున్నట్టు మాట్లాడితే ఎవడికి పడుతుంది?
ఇవన్నీ తెలుసుకోకపోగా వినాయకచవితి అంశానికి అప్పుడెప్పుడో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి కొందరు కుట్రదారుల సౌజన్యంతో జరిగిన విగ్రహాల దాడులకి లింకు పెట్టి మాట్లాడారు పవర్ స్టార్ గారు.
తాను నేరుగా చెప్పకపోయినా ముఖ్యమంత్రి హిందువు కాదు కాబట్టి హిందూ వ్యతిరేక రంగును పులిమి రాజకీయం చెయ్యాలనే ఉద్దేశ్యం ఈయన మాటల్లో కనిపిస్తుంది. ఈయన ఎంచుకున్న మార్గం అదే అయినా పర్వాలేదు. కానీ పవర్ఫుల్ గా మాట్లాడాలి కదా. అప్పుడే కదా ఇలాంటి వీడియోలు జనసైకుల్ని దాటి వైరల్ అయ్యేది. ఇక్కడ ప్రస్తావిస్తున్న పాయింట్ అది.
పక్క రాష్ట్రాల్లో నిబంధనలను పెట్టి ఉత్సవాలు జరుపుకోమంటే ఆంధ్ర ప్రదేశులో మాత్రం అసలు మండపాలే పెట్టొద్దనడమేంటి అని వాపోతున్నారు.
మాట్లాడే ముందు కనీస విషయ పరిజ్ఞానం ఉండాలి కదా? తమిళనాడులో బహిరంగ ఉత్సవాల్ని బ్యాన్ చేసింది ప్రభుత్వం. గోవాలో ఇంటికి పురోహితుడు రావడాన్ని కూడా నిషేధించింది (అక్కడున్నది బీజీపీ ప్రభుత్వం). మహారాష్ట్రా, కర్ణాటక అన్ని చోట్లా పరిస్థితి ఇలానె ఉంది. నాగపూర్లో అయితే ఆల్రెడీ మూడో వేవ్ వచ్చేసిందని చెప్తూ మండపాలు పెట్టి చేసే పండగ హడావిడికి దూరంగా ఉండమని చెప్తున్నారు.
ఇవన్నీ తెలుసుకోకుండా ప్రభుత్వాన్ని అనుమతులివ్వాలని ఆశించడం తెలివితక్కువతనం. తీరా అనుమతిచ్చాక తొమ్మిది రోజుల ఉత్సవాల కారణంగా కరోనా కేసులు కాస్త పెరిగినా ప్రభుత్వ వైఫల్యం అని మళ్లీ మెడ మీద రుద్దుకుంటూ పవర్లెస్ స్పీచివ్వడానికి రెడీ అయిపోతారు పవర్ స్టార్ గారు. పొరుగు రాష్ట్రాల మాదిరిగా నడుచుకోవాలని ఏ రాష్ట్రానికి ఆబ్లిగేషన్ ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడి పరిస్థితులు అక్కడ ఉంటాయి, ఏ ప్రభుత్వ నిర్ణయం ఆ ప్రభుత్వం తీసుకుంటుంది.
అయినా ఈ పవన్ కళ్యాణ్ గారే ఆమధ్య ప్రభుత్వం విద్యార్థులకి పరీక్షలు జరపాలంటే కోవిడ్ కారణంగా జరపొద్దని సూచించారు. మరి ఇప్పుడు మతం కారణంగా గణేష్ ఉత్సవాల్ని ఆ.ప్ర ప్రభుత్వం ఆపుతున్నట్టు కలరిస్తున్నారు. ఇలా అయినదానికి కానిదానికి కోడుగుడ్డు మీద ఈకలు పీకి మత విద్వేషాలు సృష్టించే వాళ్లు సినిమాల్లో విలన్లవుతారు కానీ హీరోలవ్వరు. అంటే పవన్ గారు సినిమా హీరోయే గానీ రియాలిటీలో విలనన్నమాట.
ఇలా అంటున్నాను కదా అని నేను పవన్ కి వ్యతిరేకిననో, ఏ రాజకీయ పార్టీనో వెనకేసుకొస్తున్నాననో అనుకోవద్దు.
కొడాలి నాని మాట్లాడితే ఆ వీడియోలు విపరీతంగా వైరల్ అవుతాయి. ఒక వర్గం సంబరపడేలాగా, మరొక వర్గం కోపంతో ఊగిపోయేలాగా ఉంటాయి ఆ మాటలు. రాజకీయాల్లో మాట్లాడేది బూతో, నీతో ప్రభావం చూపించేదిగా ఉండాలి. అలా మాట్లాడే నైపుణ్యం స్వతహాగా ఉండాలి, లేదా ప్రిపరేషన్ ద్వారా రావాలి. పవన్ గారికి రెండూ లేవనేది నిజం. అలాంటప్పుడు పార్టీ తరపున పవర్ఫుల్ స్పోక్స్ పర్సన్ ని పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఎక్కడ అతనికి పేరొచ్చేసి తాను సెకండ్ హీరో అయిపోతానోనని పవన్ కళ్యాణ్ కి ఆత్మన్యూనతాభావం. ఈ ఆత్మన్యూనత ఆయన విధానాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఏదీ మనసుతో చేస్తున్నట్టు ఉండదు. అన్నీ ఏవో న్యారో మైండెడ్ లెక్కలు వేసుకుని నడుస్తున్నట్టుంటుంది. అది మారాలి. పార్టీని బలోపేతం చేసుకోవాలి. జనసేన అంటే పవన్, నాదెండ్ల మనోహర్ తప్ప ఇంకెవ్వరూ మైండ్లోకి రారు. వీరిలో నాదెండ్ల పెద్దగా మాట్లాడింది లేదు. కళ్యాణ్ సుంకర లాంటి వ్యక్తిని పక్కనపెట్టేసారు.
చివరిగా చెప్పేదేంటంటే పవన్ కళ్యాణ్ ఇలా పేలవంగా ఉంటే ఆయన రాజకీయాల్లో రాణించడం కష్టం. కాస్త వోల్టేజు పెంచాలి. ఇలా 60క్యాండిల్ బల్బులా ఉంటే ఎవ్వరూ పట్టించుకోరు.
రమాదేవి.కె