తిరుమల వెంకన్నను దర్శించుకోవడం మహాభాగ్యంగా భావిస్తారు. అలాంటిది కరోనా ఎఫెక్ట్‌తో స్వామి దర్శనానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. సామాన్య భక్తులకు సర్వదర్శన భాగ్యం స్వామివారు కల్పించిన వరంగా భావిస్తారు.
ఎందుకంటే ఎలాంటి సిఫార్సు లేకుండా కలియుగ దైవాన్ని ప్రసన్నం చేసుకోవాలని భావించే భక్తులే ఎక్కువ. ఈ నేపథ్యంలో కరోనా సెకెండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో గోవిందుని దర్శనానికి టీటీడీ మరిన్ని సడలింపులు ఇచ్చింది.
తిరుమలకు సంబంధించి ఇది బిగ్ అప్‌డేట్. శ్రీవేంకటేశ్వరుని సర్వదర్శనానికి టీటీడీ మంగళవారం పచ్చ జెండా ఊపింది. ఇందులో భాగంగా రేపు (బుధవారం) ఉదయం 6 గంటల నుంచి తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లోని టోకెన్లు జారీ చేయనున్నారు. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది.
అయితే రోజుకు రెండు వేల సర్వదర్శనం టోకెన్లను మాత్రమే జారీ చేయనున్నారు. అది కూడా మొట్ట మొదట శ్రీవారు కొలువైన జిల్లా వాసులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కేవలం చిత్తూరు జిల్లా భక్తులకు మాత్రమే టోకెన్లు జారీ చేస్తారు. కరోనా పరిస్థితులను బట్టి టీటీడీ అదనపు టోకెన్ల జారీపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.