ఏపీకి మోదీ.. రాజకీయ ముఖచిత్రం మారుతుందా..?

ఏపీలో ప్రస్తుతం ఎత్తులు, పై ఎత్తులు, పొత్తుల రాజకీయం నడుస్తోంది. వైసీపీ సింగిల్ గా పోటీచేస్తామని ధైర్యంగా చెబుతోంది. బీజేపీ జనసేన వైపు చూస్తోంది, జనసేన టీడీపీ వైపు చూస్తోంది, ఈ రెండు పార్టీలను…

ఏపీలో ప్రస్తుతం ఎత్తులు, పై ఎత్తులు, పొత్తుల రాజకీయం నడుస్తోంది. వైసీపీ సింగిల్ గా పోటీచేస్తామని ధైర్యంగా చెబుతోంది. బీజేపీ జనసేన వైపు చూస్తోంది, జనసేన టీడీపీ వైపు చూస్తోంది, ఈ రెండు పార్టీలను చెప్పుచేతల్లో పెట్టుకోవాలని టీడీపీ అనుకుంటోంది. ఈ క్రమంలో ఏపీలో పొత్తుల రాజకీయానికి ఓ క్లారిటీ వచ్చే అవకాశం జులై-4న రాబోతోందని తెలుస్తోంది. 

జులై-4న అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ రాజకీయాలపై స్పందించే అవకాశముందని విశ్లేషణలు వస్తున్నాయి.

టీడీపీపై బీజేపీ వైఖరి ఏంటి..?

ఏపీలో టీడీపీతో పొత్తు లేదని రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పటికే చాలా సార్లు క్లారిటీ ఇచ్చారు. కానీ టీడీపీ మాత్రం ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తోంది. కేంద్రంపై అస్సలు విమర్శలు చేయకుండా, కేవలం వైసీపీని మాత్రమే టీడీపీ టార్గెట్ చేస్తోంది. ఆ క్రమంలో బీజేపీతో దోస్తీ మొదలు పెట్టాలని చూస్తోంది. 

మోదీ పర్యటనలో దీనిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఒకవేళ ఏపీకి వచ్చిన మోదీ, టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఏకరువు పెట్టి, చంద్రబాబుకి చాకిరేవు పెడితే మాత్రం కచ్చితంగా బీజేపీ-టీడీపీ దోస్తీ కటీఫ్ అయిపోయినట్టే లెక్క. ఇన్నాళ్లూ వినిపించిన ఊహాగానాలకు మోదీ పర్యటనతో చెక్ పడుతుంది.

జనసేన సంగతేంటి..?

జనసేనతో బీజేపీ పొత్తు విషయంలో మరింత క్లారిటీ వస్తుందో లేదో కూడా చూడాలి. కనీసం పవన్ కల్యాణ్ కి మోదీ అపాయింట్ మెంట్ ఇచ్చినా సరే వారి పొత్తు సజావుగా సాగుతుంది అనుకోవాలి. లేకపోతే మాత్రం జనసైనికులే కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ను ఏపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలంటూ తెగ హడావుడి చేస్తున్నారు జనసైనికులు. ఈ మేరకు బీజేపీ నేతలను వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. 

బీజేపీ-జనసేన బంధం ఎలా ఉందనే విషయం మోడీ పర్యటనతో తేలిపోతుంది. తాజాగా పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే.. అటు బీజేపీ, ఇటు టీడీపీకి ఆయన సమదూరంలో ఉన్నట్టు స్పష్టం అవుతోంది. మనసులో టీడీపీని కలిపేసుకోవాలని పవన్ కు ఉన్నప్పటికీ, బీజేపీతో దోస్తీ కారణంగా ఆయన తటపటాయిస్తున్నారు. ఆయన మాటల్లో ఆ తటపటాయింపు స్పష్టంగా కనిపిస్తోంది కూడా. లేదంటే.. ఆయన ఆప్షన్లు ఎందుకు పెడతారు? ఏకపక్షంగా ప్రకటనే చేస్తారు కదా. మోదీ పర్యటన తర్వాత పవన్ మాటల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ రోజు మరో నెల దూరంలో ఉంది.

వైసీపీతో దోస్తీ మొదలవుతుందా.?

మోదీ పర్యనటనతో వైసీపీ-బీజేపీ రాజకీయ వైరుధ్యంపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది. ఎందుకంటే.. రాష్ట్రంలో వైసీపీ-బీజేపీ రాజకీయ శత్రువులు. కేంద్రంలో మాత్రం బీజేపీకి వైసీపీ అనుకూలంగా ఉంది. దీనిపై కూడా ప్రధాని పర్యటనలో క్లారిటీ వస్తుందేమో చూడాలి. తెలంగాణ వెళ్లినప్పుడు పదే పదే కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడే మోదీ, ఏపీకి వచ్చినప్పుడు వైసీపీ ప్రభుత్వంపై ఆ స్థాయిలోనే విమర్శలు చేస్తారా లేక, జగన్ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారా అనేది తేలాల్సి ఉంది. 

జగన్ ని మెచ్చుకోకపోయినా, ప్రభుత్వాన్ని విమర్శించకుండా ఉంటే మాత్రం బీజేపీ-వైసీపీ మధ్య శతృత్వం లేనట్టే లెక్క. ఒకవేళ మోదీ.. జగన్ పాలనపై నెగెటివ్ కామెంట్ చేస్తే మాత్రం డైరెక్ట్ ఫైట్ కి దిగినట్టే అనుకోవాలి.

మొత్తమ్మీద మోదీ రాకతో.. ఏపీ రాజకీయ ముఖచిత్రంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే మోదీ పర్యటన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ ఫీవర్ మరింత రాజుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.