క్రికెట్ ఫీవర్ తో సాగర నగరం

క్రికెట్ అతి పెద్ద పండుగ. అన్ని మతాలకూ ఏకైక పండుగ. క్రికెట్ ప్రియులు కాని వారు ఎవరూ ఉండరంటే అది అతిశయోక్తి కాదు. అలాంటి పండుగ మన నగరానికే వస్తే. మన ముందే ఆటగాళ్ళు,…

క్రికెట్ అతి పెద్ద పండుగ. అన్ని మతాలకూ ఏకైక పండుగ. క్రికెట్ ప్రియులు కాని వారు ఎవరూ ఉండరంటే అది అతిశయోక్తి కాదు. అలాంటి పండుగ మన నగరానికే వస్తే. మన ముందే ఆటగాళ్ళు, ప్రత్యక్ష దైవాలు కొలువు తీరితే  ఆ అనుభూతే మజాగా ఉంటుంది కదా.

అదే ఇపుడు విశాఖలో లక్షలాది జనాలు ఆస్వాదిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే వైజాగ్ క్రికెట్ ఫీవర్ తో వేడెక్కిపోతోంది. ఈ నెల 14న విశాఖలో జరగనున్న భారత్-దక్షిణాఫ్రికా టీ 20 మ్యాచ్ కోసం టికెట్ల విక్రయాలు ఆన్ లైన్ లో స్టార్ట్ చేస్తే  హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి.

ఆన్ లైన్ అలా ఓపెన్ అయిందో లేదో ఇలా 1500, 2000 టికెట్లు యమ స్పీడ్ గా అమ్ముడైపోయి కొత్త రికార్డుని సృష్టించాయి. ఇక 3500, 6000 రూపాయల టికెట్లను ఈ నెల 8న ఆఫ్ లైన్ లో విశాఖ నగరంలోని మూడు ప్రధాన కేంద్రాలలో విక్రయిస్తారు. మరి వాటి జోరు ఎలా ఉంటుందో చూడాలి. విశాఖకు క్రికెట్ పండుగ వచ్చేసింది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది.

ఈ టీ 20 మ్యాచ్ ని చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా క్రికెట్ ప్రియులు తరలివచ్చే అవకాశాలు ఉండడంతో దానికి తగినట్లుగా విశాఖలో అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 14 విశాఖ వైపు చూడు అన్నది ఇపుడు బలమైన నినాదంగా సాగర కెరటాల సాక్షిగా హోరెత్తుతోంది.