ప్రపంచమంతా వ్యాపారమే. యుద్ధాలు, స్నేహాలు, సదస్సులు, ఒప్పందాలు అన్నింటి వెనుక వ్యాపారమే. ఇపుడు అత్యంత లాభాలు వచ్చే వ్యాపారాలు రెండే. ఆయుధాలు, ఆయిల్. ఈ రెండు గుప్పిట పెట్టుకోడానికి అమెరికా పోరాడుతూ వుంటుంది. ఆయుధాల్లో పైచేయి సాధించింది కానీ, ఆయిల్‌లో కష్టంగా వుంది. ఎందుకంటే 80 శాతం ఆయిల్ నిక్షేపాలు OPEC చేతుల్లో వున్నాయి. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ అంటే పెట్రోల్ ఎగుమతి చేసే దేశాల సంఘం. ఇది ఒక ముఠా, మాఫియా లాంటిది. ప్రపంచ ఎకానమీ అంతా ఆయిల్ మీదే ఆధారపడి వుంది కాబట్టి వీలైనంత ఎక్కువ లాభపడడానికి OPEC ప్రయత్నిస్తూ వుంటుంది.
1960కి ముందు అమెరికాలోని 7 కంపెనీలు కలిసి ఆయిల్ వ్యాపారాన్ని శాసించేవి. ధరలు అవే నిర్ణయించేవి. అమెరికా దోపిడీ పసిగట్టిన ఇరాన్, ఇరాక్ , సౌదీ అరేబియా, కువైట్, వెనిజులా కలిసి 1960లో బాగ్దాద్‌లో సమావేశమై OPEC ఏర్పాటు చేసుకున్నాయి. తర్వాత రష్యాతో పాటు చాలా దేశాలు కలిశాయి. వీటిని OPEC ఫ్లస్ అంటారు. ఇవన్నీ కలిసి మార్కెట్‌ని శాసించడం స్టార్ట్ చేశాయి.
మరి అమెరికా ఊరుకుంటుందా? ఇరాన్, ఇరాక్ కొట్టుకు చచ్చేలా చేసింది. కువైట్‌ని ఆక్రమించిన ఇరాక్‌పై యుద్ధం ఎందుకు చేసిందంటే దాని వెనుక ఆయిల్ వ్యాపారం ఉంది. ఉక్రెయిన్‌ని ఆక్రమించిన రష్యాపై ఎందుకు యుద్ధం చేయలేదంటే ఉక్రెయిన్‌తో పెద్ద ప్రయోజనం లేదు, పైగా రష్యా బలమైన దేశం.
ఇప్పటికీ చమురు వ్యాపారంలో అమెరికా కంపెనీలదే ఆధిపత్యం. ఆయిల్ కొంటే ప్రపంచంలోని ఏ దేశమైనా డాలర్లే ఇవ్వాలి. ప్రతి మనిషికీ కార్లు ఉండే తమ దేశం ఆయిల్ కోసం ఆధారపడితే ఏదో ఒకరోజు మునిగిపోతుందని గ్రహించి సొంత వనరులతో ఆయిల్ ఉత్పత్తిని పెంచింది. ఆయిల్ నిక్షేపాలు ఉన్న చోట పనికి మాలిన రూల్స్, అనుమతులు, గవర్నమెంట్ ఆఫీసుల్లోని 116 సెక్షన్లలో ఫైళ్లు తిరగడం ఏమీ లేకుండా ఆయిల్ కంపెనీలకు దండం పెట్టి తవ్వుకోమని చెప్పింది. దాంతో దిగుమతి భారం తగ్గించుకుంది.
ఇపుడు ఏమైందంటే రష్యాని బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. OPEC దేశాలు ధరలు పెంచుతున్నాయి. బ్యారెల్ ధర 120 డాలర్లు దాటింది. ఆయిల్ కంపెనీల లాభాలు, షిప్పింగ్ , మనవాళ్లు వేసే పన్నులు అన్నీ కలిసి రోజురోజుకి పెట్రోల్ ధర పెరుగుతోంది. యుద్ధం కొనసాగితే ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న ఉత్పత్తి కంటే 50 శాతం పెంచాలని (రోజుకి 6.48 లక్షలు బ్యారెల్స్) OPEC మీద ఒత్తిడి వుంది. డిమాండ్ పెరిగితే ధర పెరుగుతుంది. దీంట్లో కొస మెరుపు ఏమంటే ఆషాడం సేల్స్‌లాగా రష్యా అతి తక్కువ ధరకి మనకి ఆయిల్ అమ్ముతానని అంటోంది.
కొంటే మనకి లాభం, అమెరికాకి కోపం. ఒకవేళ మనం కొంటే, ఆ డబ్బుల్ని యుద్ధం మీద రష్యా ఖర్చు చేస్తుంది. ఎవడో ఒకడికి కష్టం రాకుండా ఇంకొకడికి లాభం రాదు. మోదీని తిట్టుకుంటూ బంకులో బండికి మనం వేయించే పెట్రోల్ వెనుక ఇంత రాజకీయం వుంది!
జీఆర్ మహర్షి