అదిగో తోక అంటే ఇదిగో పులి అన్నట్టుంది మోక్షజ్ఞ ఎంట్రీ. కొన్నేళ్లుగా ఈ నందమూరి వారసుడి డెబ్యూ కోసం బాలయ్య అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. కానీ బాలయ్య మాత్రం ఏ ఏటికాయేడు కొడుకు తెరంగేట్రాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. జాతకం బాగాలేదని ఓసారి, శాంతిపూజలని మరోసారి, నటనలో శిక్షణ అంటూ ఇంకోసారి ఇలా కొడుకు డెబ్యూ వాయిదా పడుతూనే ఉంది.
ఇప్పుడు మరోసారి మోక్షజ్ఞ ఎంట్రీపై పుకార్లు చెలరేగాయి. ఈసారి అనీల్ రావిపూడి పేరు తెరపైకి వచ్చింది. రావిపూడి దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ, హీరోగా పరిచయం అవుతాడంటూ కథనాలు వస్తున్నాయి. వీటిపై సదరు దర్శకుడు స్పందించాడు. అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చాడు.
“నా వరకు రాలేదు ఆ న్యూస్. బయట మాత్రం బాగానే సర్కులేట్ అవుతోంది. మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే అవకాశం వస్తే కచ్చితంగా చేస్తా. బాలయ్య మాత్రం నన్ను అడగలేదు. మా మధ్య అసలు అలాంటి టాపిక్ రాలేదు. పూర్తి ఫోకస్ బాలకృష్ణతో చేయాల్సిన ప్రాజెక్టుపైనే పెట్టాను. వాళ్ల అబ్బాయి లాంఛింగ్ పై ఆయన ఎలాంటి ప్లానింగ్ లో ఉన్నారో నాకు తెలీదు.”
ఇలా మోక్షజ్ఞను లింక్ చేస్తూ తనపై జరుగుతున్న ప్రచారాన్ని అనీల్ ఖండించాడు. నిజానికి ఈ తరహా పుకార్లు రావడం ఇదేం కొత్తకాదు. గతంలో బాలయ్యతో క్రిష్ సినిమా చేసినప్పుడు, బోయపాటి అఖండ సినిమా చేసినప్పుడు, కేఎస్ రవికుమార్ సినిమా తీసినప్పుడు.. ఆ దర్శకులుతో మోక్షజ్ఞ ఎంట్రీ అంటూ గాసిప్పులు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు అనీల్ రావిపూడి పేరు చేరిందంతే.