నిఖిల్ పేరు చెప్పగానే ఆయన నటిస్తున్న సినిమాలు వరుసగా గుర్తొస్తాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ హీరో. అతడు నటిస్తున్న స్పై సినిమా గ్లింప్స్ తాజాగా విడుదలైంది. అంతకంటే ముందు కార్తికేయ-2 థీమ్ మోషన్ పోస్టర్ రిలీజైంది. దాని కంటే ముందు 18-పేజెస్ హంగామా బాగా నడిచింది.
ఇలా నిఖిల్ అప్ కమింగ్ మూవీస్ గురించి టాపిక్ వచ్చిన ప్రతిసారి ఈ 3 సినిమాలపై చర్చ జరుగుతుంది. కానీ ఇదే లిస్ట్ లో మరో సినిమా కూడా ఉంది. షూటింగ్ కూడా పూర్తయింది. కానీ దాని గురించి ఎవ్వరూ మాట్లాడరు. నిఖిల్ కూడా చెప్పడు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా?
నిఖిల్-సుధీర్ వర్మ కాంబినేషన్ లో ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. దాదాపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయింది. ఇంకా చెప్పాలంటే, స్పై సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే నిఖిల్-కార్తికేయ సినిమా షూట్ పూర్తయింది. కానీ ఈ సినిమాపై పెద్దగా చర్చ జరగదు. అలా అని ఇదేదో పెద్దగా ప్రాముఖ్యం లేని కాంబినేషన్ అనుకుంటే పొరపాటు.
ఇంతకుముందు నిఖిల్-సుధీర్ వర్మ కలిసి స్వామి రారా లాంటి హిట్ సినిమా చేశారు. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో కేశవ లాంటి రివెంజ్ డ్రామా వచ్చింది. ఇప్పుడు ఇద్దరూ కలిసి మరో మూవీ చేశారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ లాంటి పెద్ద ప్రొడ్యూసర్ నిర్మించిన సినిమా ఇది. పైగా, బాగా డబ్బు ఖర్చు పెట్టి విదేశాల్లో షూటింగ్ చేశారు.
ఇంత వెయిట్ ఉన్న సినిమాపై ఎలాంటి చర్చ లేదు. మేకర్స్ కనీసం ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు. టైటిల్ కూడా చెప్పలేదు. దర్శకుడు వేరే సినిమాల పనిలో పడ్డాడు. ఇంతకుముందే చెప్పుకున్నట్టు హీరో మిగతా సినిమాల పనిలో పడ్డాడు. నిర్మాత కూడా వైష్ణవ్ తేజ్ సినిమాపై ఫోకస్ పెట్టాడు.
మరి ఈ సినిమాను ఎందుకిలా వదిలేశారు? అవుట్ పుట్ సరిగ్గా రాలేదా? ప్రచారానికి ముహూర్తం సెట్ అవ్వలేదా? లేక నేరుగా ఓటీటీకి ఇచ్చే ఆలోచనలో ఉన్నారా? వీటిపై కూడా ఎవ్వరూ మాట్లాడ్డం లేదు.