ఫ్యాన్స్ అత్యుత్సాహం.. పవన్ కు పరువు తక్కువ

పవన్ కల్యాణ్ సినిమా రంగానికి అతీతుడేం కాదు. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ ఉంటే చాలు అని అభిమానులు అనుకున్నా.. ఆ కటౌట్ ఉన్న సినిమాలు కూడా దారుణంగా విఫలమైన ఉదాహరణలున్నాయి. ఇక రాజకీయాల్లో అయితే…

పవన్ కల్యాణ్ సినిమా రంగానికి అతీతుడేం కాదు. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ ఉంటే చాలు అని అభిమానులు అనుకున్నా.. ఆ కటౌట్ ఉన్న సినిమాలు కూడా దారుణంగా విఫలమైన ఉదాహరణలున్నాయి. ఇక రాజకీయాల్లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

పవన్ కల్యాణ్ రాజకీయాలకు అస్సలు ఏమాత్రం పనికిరాడు, ఆయనకు ప్రజాబలం లేదనే విషయం ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. కానీ అభిమానుల అతి మాత్రం తగ్గలేదు.

గతంలో ఏ స్టార్ హీరో సినిమా విడుదలైనా.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అక్కడ రచ్చ లేపేవారు. పవన్ గురించి గొప్పగా మాట్లాడాలని డిమాండ్ చేసేవారు, గోలగోల చేసేవారు. బన్నీ లాంటి స్టార్లతో 'చెప్పను బ్రదర్' అనిపించుకున్నారు. గట్టి గానే సున్నం పెట్టించుకున్నారు. ఇప్పుడు పవన్ ను సీఏం అభ్యర్థిగా ప్రకటించాలంటూ కొత్త డిమాండ్ ఎత్తుకున్నారు. ఈసారి రాజకీయ నాయకుల వెంట పడుతున్నారు. బీజేపీ నాయకుల వెంటపడి మరీ పవన్ ని సీఎం అభ్యర్థిగా ప్రకటించండి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఈ అతి జనసేన కొంప ముంచుతోంది. పవన్ కు ఉన్న కాస్త పరువును తీస్తోంది. పవన్ సీఎం అవుతాడా అవ్వడా.. సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా ప్రకటించరా అనేది తర్వాత సంగతి.. ముందు కలిసికట్టుగా గెలిచే రూటు ఆలోచించాలి. అది వదిలేసి సీఎం అభ్యర్థిగా ప్రకటించాలంటూ డిమాండ్ చేయడం, బ్యానర్లు కట్టడం హాస్యాస్పదం. చూస్తుంటే.. ఈ పెయిడ్ ఉద్యమాన్ని తెరవెనక నుంచి పవన్ కల్యాణే ఎగదోస్తున్నట్టు కనిపిస్తోంది.

ప్రకటిస్తే ఏమవుతుంది..?

పవన్ ని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఏమవుతుంది. 2019 ఎన్నికల్లో పవన్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా సోలోగానే వెళ్లారు కదా. పోనీ మద్దతిచ్చిన బీఎస్పీ, వామపక్షాల్లో సీఎం క్యాండిడేట్ ఎవరూ లేరు కదా. అప్పుడు సీఎం అభ్యర్థిగా ప్రకటించినా, ప్రకటించకపోయినా ఉపయోగం ఏమీ కనపడలేదు కదా. 

పోనీ ఇప్పుడు పవన్ చెప్పిన మూడు ఆప్షన్లలో ఒకటి సోలో ఎంట్రీ ఉంది కదా. సోలోగా బరిలో దిగితే పవన్ ని సీఎం అభ్యర్థిగా ప్రకటించాల్సిన అవసరమే లేదు. అయినా కూడా బీజేపీ కలవాలి, బీజేపీ నేతలు పవన్ ని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి. ఇదీ ప్రస్తుతం జనసేన నుంచి వినిపిస్తున్న డిమాండ్.

ఈ డిమాండ్ తో బీజేపీ నేతలతో కావాలనే వారు సున్నం పెట్టుకుంటారు. అసలెవరీ పవన్ కల్యాణ్, ఆయన్ను సీఎం అభ్యర్థిగా మేమెందుకు ప్రకటించాలి అని అనిపించుకుంటారు. ఆ ముచ్చట కూడా తీర్చేందుకే జనసైనికులు ఇలా అతి చేస్తున్నట్టు కనిపిస్తోంది. లేకపోతే జేపీ నడ్డాకు జనసైనికులు వార్నింగ్ ఇవ్వడమేంటి? కామెడీ కాకపోతే.
 
ఇప్పటికే పవన్ ఇచ్చిన ఆప్షన్లు, జనసేన చేస్తున్న సీఎం అభ్యర్థి డిమాండ్ పై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఈ ఉద్యమం మరింత ఉదృతం అయితే పోయేది పవన్ పరువే. సీఎం అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత, కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోతే.. అప్పుడు పరువు పూర్తిగా తుడుచిపెట్టుకుపోతుంది.