'నేను ఆశావాదిని.. ఎప్పుడూ అధైర్యపడను..' అన్నారట తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ మాట ఏ ఏపీ తెలుగుదేశం కార్యకర్తల మధ్యన చెబితే.. చంద్రబాబు నాయుడులో ఆశావాది ఉన్నాడని ఎవరైనా చెప్పగలరు. అయితే ఎటొచ్చీ చంద్రబాబు నాయుడు ఈ మాటలను తెలంగాణ తమ్ముళ్ల మధ్యన చెప్పడమే ప్రహసనంగా ఉందని అంటున్నారు విశ్లేషకులు.
తెలంగాణ తెలుగుదేశం కార్యకర్తలు కొంతమంది అమరావతి వెళ్లి చంద్రబాబు నాయుడను కలిశారట. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మనుగడ చారిత్రక అవసరం అని చెప్పారట. ఉభయ తెలుగు రాష్ట్రాలకూ తెలుగుదేశం పార్టీ అవసరం చాలానే ఉందని అన్నారట. ఈ రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ మళ్లీ పుంజుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారట చంద్రబాబు నాయుడు.
ఏపీ విషయంలో పుంజుకోవడం గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడితే అదోలెక్క. అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్లీ పుంజుకుంటుందని చంద్రబాబు నాయుడు చెప్పడమే జనాలకు కూడా వింతగా ఉంది. తెలంగాణలో ఇప్పటికీ నేతలు మాత్రమే తెలుగుదేశం పార్టీని వీడారని, కార్యకర్తలు మాత్రం తెలుగుదేశంతోనే ఉన్నారని చంద్రబాబు నాయుడు అన్నారట.
మరి అంత సీనే ఉంటే.. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కనీసం ఎందుకు పోటీ చేయలేకపోయిందో, పోటీ ఇచ్చే సంగతి అంటుంచి, కనీసం పోటీ చేయలేని స్థితికి తెలుగుదేశం పార్టీ ఎందుకు వెళ్లిందో చంద్రబాబే చెప్పాలని, ఆ మాట తెలంగాణ తెలుగు తమ్ముళ్లు చంద్రబాబును అడగలేదా? అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు!