ఇండస్ట్రీలో కొత్తగా గిల్డ్ అనే కట్టుబాటు వచ్చింది. యాక్టివ్ నిర్మాతలు కలిసి, కాస్త కట్టుబాటుతో సినిమాలను బతికించుకునే ఆలోచనలు చేస్తున్నారు. మంచిదే. అందులో భాగంగానే అల్లు అరవింద్, దిల్ రాజు కలిసి, వాల్మీకి-గ్యాంగ్ లీడర్ సినిమాల విషయంలో చర్చలు సాగించారు. వాల్మీకిని ఒకవారం వెనక్కు పంపించారు. బాగానే వుంది.
కానీ ఇధే పరిస్థితి అల్లు అరవింద్, దిల్ రాజుల సినిమాలకు వస్తే, గిల్డ్ నేతలుగా త్యాగంచేసి వెనక్కు వెళ్తారా? ఇదీ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న గుసగుసల ప్రశ్న. ఈ ఏడాది క్రిస్మస్ కు దిల్ రాజు నిర్మించిన సమంత-శర్వానంద్ ల 96, అల్లు అరవింద్ నిర్మిస్తున్న సాయిధరమ్-రాశీఖన్నాల 'ప్రతిరోజూ పండగే' సినిమా విడుదల వున్నాయి. వీటితోపాటు రవితేజ 'డిస్కో రాజా', నితిన్ 'భీష్మ', ఇంకా మరో రెండు మూడు సినిమాల పేర్లు వినిపిస్తున్నాయి.
మరి గిల్డ్ లీడర్లుగా ఈ సమస్యను దిల్ రాజు-అల్లు అరవింద్ లు ఎలా పరిష్కరిస్తారో చూడాలి. తమ సినిమా కోసం మిగిలిన వారిని వెనక్కు నెడతారో? లేక గిల్డ్ నేతలుగా అందరికీ ఆదర్శంగా వుండడానికి తాము త్యాగంచేసి, వెనక్కు వెళ్తారో చూడాలి. దీనిని బట్టే భవిష్యత్ లో గిల్డ్ నాయకత్వం మాట చెల్లుబాటు వుంటుందని, కొందరు గిల్డ్ సభ్యులే గుసగుసలు పోతున్నారు.