తన తొలి సినిమాను కోటిన్నర రూపాయల బడ్జెట్ తో పూర్తిచేసిన విషయాన్ని గుర్తుచేశాడు నటుడు ప్రభాస్. 'సాహో' సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న ఈ హీరో తన తొలి సినిమా 'ఈశ్వర్'ను కేవలం కోటిన్నర రూపాయల బడ్జెట్ తో పూర్తి చేసినట్టుగా చెప్పాడు. ఆ సినిమాను చాలావరకూ రోడ్ల మీదే చిత్రీకరించిన విషయాన్ని కూడా ప్రభాస్ ప్రస్తావించాడు.
కృష్ణంరాజు సినీ వారసుడుగా ప్రభాస్ ఆ సినిమాతో తెరకు పరిచయం అయ్యాడు. సినిమా సో.. సో.. అనిపించింది. ఆర్పీ పట్నాయక్ పాటలకు అప్పట్లో ఒక రకమైన క్రేజ్ ఉండేది. ఈశ్వర్ లో పాటలు అలా హైలెట్ అయ్యాయి. జయంత్ దర్శకత్వంలో రూపొందింది ఆ సినిమా. అప్పటికే జయంత్ ఖాతాలో సూపర్ హిట్స్ ఉన్నాయి. అలా దర్శకుడి ఇమేజ్ కూడా ఆ సినిమాకు కొంత వరకూ కలిసివచ్చింది. ప్రభాస్ లాంచింగ్ కు అయితే ఆ సినిమా బాగానే ఉపయోగపడింది.
ఆ తర్వాత సురేష్ కృష్ణ 'రాఘవేంద్ర' అంటూ ప్రభాస్ ను తనమార్కు 'భాషా'గా చూపించాడు. ఈ సినిమా యావరేజ్ టాక్ తో నడించింది. మూడో సినిమా 'వర్షం'తో ప్రభాస్ దశ తిరిగింది. ఆ సినిమా సాధించిన సంచలనంతో ప్రభాస్ ఇండస్ట్రీలో హ్యాపీగా సెటిలయిపోయాడు.
ఆ తర్వాత 'చక్రం' వంటి ఫ్లాప్ పలకరించినా.. నెమ్మనెమ్మదిగా పుంజుకొంటూ వచ్చి ప్రభాస్ రేంజ్ 'బాహుబలి'తో అతి భారీస్థాయికి రీచ్ అయ్యింది. అది ఇప్పుడు 'సాహో' బడ్జెట్ తో ప్రతిఫలిస్తోంది. కోటిన్నర రూపాయల బడ్జెట్ సినిమాతో పదిహేడేళ్ల కిందట కెరీర్ మొదలుపెట్టిన ప్రభాస్ ఇప్పుడు మూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ స్థాయికి చేరడమే పెద్ద విశేషం.