ఆ మంత్రుల సీటు కిందకు నీళ్లు.. జగన్ చేతిలో రిపోర్ట్

మంత్రివర్గ విస్తరణలో భాగంగా జగన్ తన పని ముమ్మరం చేశారు. గతంలో ఓసారి మంత్రుల పనితీరుపై నివేదికలు తెప్పించుకున్న జగన్, తాజాగా మరోసారి కొత్తగా తెచ్చిన రిపోర్టులు పరిశీలిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈసారి…

మంత్రివర్గ విస్తరణలో భాగంగా జగన్ తన పని ముమ్మరం చేశారు. గతంలో ఓసారి మంత్రుల పనితీరుపై నివేదికలు తెప్పించుకున్న జగన్, తాజాగా మరోసారి కొత్తగా తెచ్చిన రిపోర్టులు పరిశీలిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈసారి చాలామంది మంత్రులు తమ పదవులు కోల్పోబోతున్నారు. వీరిలో డిప్యూటీ సీఏం పుష్ప శ్రీవాణి, నారాయణస్వామి ఉన్నట్టు సమాచారం. 

కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, తానేటి వనిత, శ్రీరంగనాథరాజు పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మొన్నటివరకు లిస్టులో లేని అవంతి శ్రీనివాస్ పేరు కూడా తాజాగా జాబితాలో చేరినట్టు తెలుస్తోంది. దీనికి కారణం ఆమధ్య లీకైన ఆడియో అంటున్నారు.

అసంతృప్తి చెలరేగకుండా ''ప్రత్యేక బుజ్జగింపులు''..

గతంలో మంత్రివర్గ ఏర్పాటు సమయంలో జగన్ పెద్దగా ఇబ్బంది పడలేదు. చాలామంది సీనియర్లను, మంత్రి పదవి కన్ఫామ్ అనుకున్నవారిని పక్కనపెట్టినా ఎవరికీ ఎలాంటి బుజ్జగింపులు లేవు. 

రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని అప్పుడే హింటివ్వడంతో అందరూ భవిష్యత్ పై ఆశలు పెట్టుకున్నారు. కొందరు పరిస్థితి అర్థం చేసుకుని సర్దుకుపోయారు. మరికొందరు సన్నిహితుల వద్ద అసంతృప్తి వెళ్లగక్కారు. కానీ ఎవరూ బయటపడలేదు. ఈసారి మాత్రం పరిస్థితి అలా ఉండకపోవచ్చు.

రెండేళ్లకు పైగా మంత్రి పదవుల్లో ఉన్నవారు ఒక్కసారిగా దిగిపోవాలంటే కాస్త కష్టమే. జిల్లాల్లో తమ ఇమేజి డ్యామేజీ అవుతుందనే బాధ కూడా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తమ గెలుపుపై ఈ పరిణామం ప్రభావం చూపిస్తుందనే బాధ కూడా ఉంటుంది. 

అందుకే మంత్రి పదవులు కోల్పోయిన వారికి ప్రత్యేక బుజ్జగింపులు ఉంటాయని తెలుస్తోంది. భవిష్యత్తులో తగిన ప్రాధాన్యమిస్తానని, ఒకవేళ ఇదే కారణంతో వచ్చే ఎన్నికల్లో రిజల్ట్ తేడా కొడితే, ఎమ్మెల్సీ పదవితో ఆదుకుంటానని కూడా హామీ ఇవ్వబోతున్నారట జగన్. మరి ఇలాంటి హామీలకు వారు మెత్తబడతారా లేదా అనేది చూడాలి.

మంత్రివర్గ విస్తరణకు ఎన్నికల టీమ్ కు సంబంధం లేదు..

ప్రస్తుతం ఏపీలో జరగాల్సిన మంత్రివర్గ విస్తరణకు, ఎన్నికల టీమ్ కు సంబంధం లేదని తెలుస్తోంది. కేవలం పనితీరు ఆధారంగానే కొంతమందిని పక్కనపెట్టి, గతంలో అవకాశం ఇవ్వలేని వారికి ఇప్పుడు ఛాన్స్ ఇవ్వబోతున్నారట. 

ఆ ప్రకారం అందరినీ సంతృప్తి పరిచేందుకే జగన్ ప్రయత్నాలు మొదలు పెట్టారని సమాచారం. ఎలక్షన్ టీమ్ ని సెపరేట్ గా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు జగన్.

ఎన్నికల కోసం వైసీపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్..

పదవులు వేరు, బాధ్యతలు వేరు. మంత్రి పదవుల్లో సామాజిక న్యాయం ప్రధానం. అదే సమయంలో ఎన్నికల టాస్క్ ఫోర్స్ లో ఇలాంటి సూత్రాలేవీ పాటించనక్కర్లేదు. పార్టీని పటిష్టపరిచేవారు, పార్టీ కోసం సమయం కేటాయించేవారు, ప్రజల్లోకి బలంగా వెళ్లేవారే ఈ టాస్క్ ఫోర్స్ లో ఉంటారు. 

రాజకీయాల్లో చురుగ్గా లేకపోయినా ఎన్నికల విషయంలో టాలెంట్ చూపించేవారికి వైసీపీ ఎన్నికల స్పెషల్ టాస్క్ ఫోర్స్ లో చోటు ఉంటుంది.

అయితే ఈ కూర్పు ఇప్పుడే కాదు. దీనికింకా సమయం ఉంది. ఎన్నికల ఏడాదిలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ తెరపైకి వస్తుంది. ఈ కేటగిరీలన్నిటినీ వేర్వేరుగా ఉంచేందుకు జగన్ ఓ రేంజ్ లో కసరత్తులు చేస్తున్నారని తెలుస్తోంది.