ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై రాజకీయ దాడి చేసేందుకు అవకాశం చిక్కిందని కొంత మంది నాయకులు సంబరపడుతున్నారు. వినాయక చవితి నాడు మండపాలు ఏర్పాటు చేసి బొజ్జ గణపయ్యను కొలువుదీర్చి జనం గుమిగూడొద్దని ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించడం రాజకీయ దుమారానికి కారణమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్రిస్టియన్ కాబట్టే, హిందుమతంపై దాడి చేస్తున్నారంటూ బీజేపీ నేతలు సరికొత్త పల్లవి అందుకున్నారు.
అసలే బీజేపీ… అలాంటిది మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు చిన్న అవకాశం దక్కినా విడిచిపెట్టదనే అభిప్రాయాలున్నాయి. కోతి పండు బ్రహ్మాండం అంటే ఏంటో బీజేపీ చేష్టలే నిదర్శనమనే ప్రత్యర్థుల విమర్శలను కొట్టి పారేయలేం.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి వినాయక చవితి నాడు ఆంక్షలు విధించినా, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ మతం కోణంలో చూస్తూ వివాదాస్పదం చేస్తోంది. ఇందుకు రకరకాల వాదనలను తెరపైకి తీసుకొస్తోంది. ప్రధానంగా వైఎస్సార్ వర్ధంతి నాడు పెద్ద ఎత్తున గుడిగూడారని విమర్శిస్తోంది.
ఈ నేపథ్యంలో రాజకీయంగా ఎక్కడున్నారో కూడా తెలియని ఏపీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఒక్కసారిగా యాక్టీవ్ అయ్యారు. కన్నా లక్ష్మినారాయణతో పాటు బీజేపీ , వీహెచ్‌పీ నేతలంతా విజయవాడలో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్‌లో హిందూమతంపై దాడులు జరుగుతున్నాయని కన్నా లక్ష్మినారాయణ ఆరోపించారు. వినాయకచవితిని ఇంట్లోనే జరుపుకోవాలన్న జీవోను ఖండిస్తున్నామని చెప్పారు. సినిమా హాళ్లు, స్కూళ్లు, బార్లకు లేని నిబంధనలు ఉత్సవాలకా? అని కన్నా లక్ష్మినారాయణ ప్రశ్నించారు. గవర్నర్ జోక్యం చేసుకొని ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని కోరినట్టు కన్నా వెల్లడించారు.
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్‌పరం చేస్తూ…ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని దెబ్బ కొడుతున్నా ఏనాడూ ఈ నాయకులు ఇంట్లో నుంచి బయటకు రాలేదు. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చకపోయినా రాష్ట్రపతినో, ప్రధానినో కలవాలన్న ఆలోచన రాదు.
రాష్ట్రాభివృద్ధి కోసం తమ పార్టీ ఏలుబడిలో ఉన్న కేంద్రంతో మాట్లాడిన, మాట్లాడాలన్న స్పృహ ఏపీ బీజేపీ నేతలకు లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానీ మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడానికి మాత్రం వీళ్లంతా ముందుంటారనే సంగతి వినాయక చవితితో తెలిసొచ్చింది.