దేశంలోని వివిధ రాష్ట్రాల ఎన్నికలు వచ్చాయంటే.. వాటిల్లో ప్రశాంత్ కిషోర్ పాత్ర కూడా చర్చనీయాంశంగా నిలుస్తూ వస్తోంది. అయితే ఇటీవలి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత…ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్ పని నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్టుగా పీకే చెప్పుకొచ్చారు.
ఇండియన్ పాలిటిక్స్ లో ప్రశాంత్ కిషోర్ పని మిడాస్ టచ్ గా పేరు తెచ్చుకుంది. పీకే ఎటు వైపు ఉంటే అటువైపే విజయం అనేంత సీన్ ఏర్పడింది. ఇలాంటి నేపథ్యంలో.. త్వరలోనే యూపీ, పంజాబ్ వంటి రాష్ట్రాల ఎన్నికలున్నాయి. మరి వీటిల్లో పీకే ఏ పాత్రను స్వీకరించబోతున్నాడనేది ఆసక్తిదాయకమైన అంశమే.
ఈ అంశంపై ఇప్పుడు వినిపిస్తున్న మాటేమిటంటే.. ఈ ఎన్నికల్లో పీకే ఎలాంటి యాక్టివ్ రోల్ పోషించబోవడం లేదనేది. అటు స్ట్రాటజిస్టుగా కానీ, ఇటు ఏదైనా పార్టీ నాయకుడిగా కానీ ఈ ఎన్నికల్లో పని చేయబోవడం లేదట పీకే. ఈయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటాడని ఆ మధ్య బాగా ప్రచారం జరిగింది. ఆ మేరకు వరస చర్చలు కూడా జరిగాయంటారు. అయితే పీకే ఆ మేరకు అధికారిక ప్రకటన ఏదీ చేయలేదు.
అలాగే పంజాబ్ రాష్ట్ర సలహాదారు పదవిని ఒకదాన్ని కూడా పీకే వదులుకున్నాడు ఈ మధ్యనే. దీంతో.. పీకే అడుగులు ఎటువైపు అనేది ఆసక్తిదాయకంగా నిలిచింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, స్టాలిన్, మమతా బెనర్జీ.. ఇటీవలి కాలంలో పీకే వీళ్ల కోసం వరసగా పని చేస్తూ వచ్చారు. వీరంతా ఇప్పుడు ముఖ్యమంత్రుల హోదాలో ఉన్నారు. మరి ఇప్పుడు పీకే ఎవరిని టచ్ చేయబోతున్నారు.. ఈ మిడాస్ టచ్ మరోసారి ఇంకెవరికైనా చేరువ అయితే అది హాట్ టాపిక్కే అవుతుంది.
ప్రత్యేకించి పంజాబ్ సీఎం అమరీందర్ కు పీకే మీద బాగా గురి ఉంది. అందుకే పిలిచి మరీ పదవిని ఇచ్చాడు. త్వరలోనే పంజాబ్ ఎన్నికలు జరగున్నాయి. అమరీందరే తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని కూడా కాంగ్రెస్ ప్రకటిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో కనీసం అమరీందర్ కోసం అయినా పీకే పని చేస్తారా? అనే చర్చ సాగుతోంది.
పీకే వ్యక్తిగతంగా అలాంటి బాధ్యతలేవీ తీసుకోన్నట్టుగా లేదీసారి. అలాగే ఆయన కాంగ్రెస్ చేరిక కూడా జరగలేదు. ఇటీవలే 23 పార్టీల నేతలతో సమావేశాలు.. వారందరినీ ఒక తాటి మీదకు తీసుకు వచ్చే ప్రయత్నాలను పీకే మొదలుపెట్టినట్టుగా కూడా గుసగుసలు వినిపించాయి. ఈ పరిస్థితుల మధ్యన త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత.. ప్రశాంత్ కిషోర్ కు కూడా రాజకీయ స్పష్టత వచ్చి, ఏదైనా స్పష్టమైన లక్ష్యం ఏర్పడుతుందేమో! అంత వరకూ కామ్ గా ఉంటారేమో!