ఎవరైనా కరోనా రోగిని అతడికి ఎలా కోవిడ్ వైరస్ సోకిందని అడిగితే.. దానికి సూటిగా సమాధానం ఉండని పరిస్థితి నెలకొని చాలా కాలం అయ్యింది. కరోనా ఎలా సోకిందనే రూట్స్ ను అన్వేషించడం దాదాపు అసాధ్యంగా మారింది. ఫలానా వారి వల్ల తనకు కరోనా సోకిందని చెప్పడం దాదాపు అసాధ్యం. అంతలా సమాజంలో కరోనా వ్యాపించిపోయి చాలా కాలం అయ్యింది. ట్రాక్ చేయడం ఏ మాత్రం సులువు కాదు.
ఇంట్లో ఒకరికి వస్తే.. వారి నుంచి మరొకరికి సోకడం అనేదాన్ని పక్కన పెడితే, ఉత్తిపుణ్యానికి కరోనాకు గురైన వారెంతో మంది ఉంటారు. దారిన పోతున్నప్పుడే ఆ వైరస్ తగులుకుంటుందో, ఫుడ్ తో వస్తోందో, మాస్కులు ధరించినా, శానిటైజర్లు, హ్యాండ్ వాష్ లు నిత్యం వాడుతున్నా.. అనేక మంది కరోనాకు గురయ్యారు. అలాంటి వారి విషయంలో ట్రాక్ చేయడం మొదలు పెడితే తలబొప్పి కట్టడం ఖాయం.
మరి ఇలాంటి వైరస్ విషయంలో స్ప్రెడ్ చేశారంటూ ఒక వ్యక్తికి జైలు శిక్షను విధించేశారు వియత్నాంలో! క్వారెంటైన్ రూల్స్ ను పాటించకుండా, వేరే వాళ్లకు కరోనా సోకడానికి కారణమయ్యాడంటూ ఒక 28 యేళ్ల వ్యక్తికి ఐదు సంవత్సరాల జైలు శిక్షను విధించారట వియత్నాంలో. అతడి వల్ల మొత్తం ఎనిమిది మందికి కరోనా సోకిందట. వారిలో ఒకరు మరణించారట. ఇందుకు గానూ శిక్ష ఐదు సంవత్సరాలుగా వియత్నాం కోర్టు తీర్పును ఇచ్చింది.
బహుశా కరోనా ను అంటించాడంటూ ఒక వ్యక్తికి శిక్షను విధించడం ఇదే ప్రథమం కాబోలు. క్వారెంటైన్ రూల్స్ ను అతిక్రమించాడంటూ శిక్ష అంటే.. అదో రకం. అయితే.. అతడి వల్ల సరిగ్గా ఎనిమిది మందికి కరోనా సోకిందని నిర్ధారించడం, వారిలో ఒకరి మరణానికి అతడే కారణమంటూ తేల్చడం ఏం న్యాయమో మరి. సరిగ్గా ఆ వ్యక్తే ఏమీ కరోనా వైరస్ ను సృష్టించలేదు కదా! అతడూ కావాలని ఆ వైరస్ ను అంటించుకుని ఉండదు కదా! అలాగే కచ్చితంగా అతడి వల్లనే సోకిందనేందుకు సాక్ష్యం ఎవరు చెప్పినట్టు? కరోనా వైరస్ చెప్పిందా? లేక అతడి డీఎన్ఏ ఏమైనా ఇతరుల వైరస్ మూలాల్లో బయటపడిందా? ఈ రకంగా చూస్తే.. ఇదో విచిత్రమైన, విడ్డూరమైన శిక్షే!
మరి ఇలా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకడం.. అనే మూలాలను పట్టుకుంటూ, వెళ్లి శిక్షలు విధించడం మొదలుపెడితే.. వైరస్ సోకిన వారందరూ జైళ్లలోనే ఉండాలేమో!