మహారాష్ట్ర గవర్నమెంట్ పై గతంలో విమర్శలు గుప్పించి, శివసేన పై దూకుడుగా వ్యవహరించిన నటి కంగనా రనౌత్ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విన్నపం చేసిందిప్పుడు! దాదాపు ఏడాది కిందట కంగనా వర్సెస్ మహారాష్ట్ర గవర్నమెంట్ రచ్చ పెద్దగానే సాగింది. ముంబైలో కంగనా ఆఫీసును కూల్చి వేయడం హాట్ టాపిక్ గా నిలిచింది.
బృహత్ బొంబాయి నగర పాలిక నియమాలను అనుసరించలేదంటూ కంగనా భవంతిని అధికారులు దగ్గరుండి కూల్చి వేయించారు. ఆ అంశం కోర్టుకు చేరింది. అలాగే ఆమె చేసిన కామెంట్లపై కేసుల నమోదయ్యాయి. ఒక దశలో ముంబైలో అడుగుపెట్టడానికి కూడా కంగనా భయపడింది. చివరకు భారీ భద్రతా ఏర్పాట్ల మధ్యన కోర్టు నుంచి ముందస్తు బెయిల్స్ అన్నీ పొంది.. కంగనా అక్కడ అడుగుపెట్టింది.
ఏతావాతా.. కంగనా, మహారాష్ట్ర గవర్నమెంట్ ల మధ్యన ఒక చిన్నసైజు వార్ నడిచింది. మరి ఇప్పుడు ఈమె విన్నపం పట్ల ఠాక్రే ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో కానీ.. సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది కంగనా. దాని సారాంశం ఏమిటంటే.. మహారాష్ట్రలో థియేటర్లను తెరవాలనేది! మహారాష్ట్రలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని, కాబట్టి థియేటర్లను తెరవడానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని కంగనా తన పోస్టులో విన్నవించింది. ఈ వారంలోనే కంగనా సినిమా తలైవి విడుదల కానుంది. అందుకే ప్రత్యేకంగా విన్నవిస్తూ.. థియేటర్లను తెరవాలని కంగనా కోరుతోంది. థియేటర్లను తెరిస్తే ప్రేక్షకులను రప్పించే సత్తా తన తాజా సినిమాలో ఉందని కంగనా కాన్ఫిడెంట్ గా చెబుతోంది. ఇదీ కథ.
తన సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండే సరికి కంగనా ఇలా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అర్థిస్తోంది. అయినా.. కరోనా సమయంలో ప్రభుత్వాల తీరును కూడా కంగనా కడిగేసినట్టుగా ఉంది. బీజేపీ వాళ్లను కాకుండా ఇతర ప్రభుత్వాలను విమర్శించినట్టుగా ఉంది. మరి ఇప్పుడు తన సినిమా వరకూ వచ్చేసరికి.. అర్జెంటుగా థియేటర్లను తెరవాలని అనడం ఏమిటో!
రోజుకు ఐదారు వేలకు పైగా కేసులు వస్తున్నా.. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గినట్టుగా అనిపిస్తోంది కంగనాకు. ఎంతైనా తన సినిమా విడుదల కదా.. ఇప్పుడు అంతా మామూలుగా అనిపిస్తుంది. అర్జెంటుగా థియేటర్లను తెరిచేయాలనిపిస్తుంది. అయినా కంగనా ఎక్కడో సోషల్ మీడియాలో విన్నవిస్తే ఠాక్రే ప్రభుత్వం దాన్ని పట్టించుకుంటుందా అసలు?