ఇది ముమ్మాటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఊరట కలిగించే అంశం. ఇదే సందర్భంలో ఎల్లో బ్యాచ్‌కు తీవ్ర నిరాశ కలిగించే అంశమే. బహిరంగ మార్కెట్ నుంచి రూ.10,500 కోట్లు అప్పు తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆర్థికశాఖ వ్యయ విభాగం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్‌కు కేంద్ర ఆర్థిక శాఖ సమాచారం పంపింది.
ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో మొదటి 9 నెలల కాలానికి కేంద్ర ఆర్థికశాఖ అనుమతిచ్చిన పరిమితి మేరకు రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసు కుంది. దీంతో రానున్న కాలంలో సంక్షేమ పథకాలు, ఉద్యోగుల జీతభత్యాలు, ఇతరత్రా పనులకు ప్రభుత్వం దగ్గర చిల్లి గవ్వ కూడా లేదని, దీంతో ఆర్థిక సంక్షోభంలో రాష్ట్ర ప్రభుత్వం కూరుకుపోయిందంటూ ఎల్లో గ్యాంగ్ పెద్ద ఎత్తున ప్రచారానికి తెగబడ్డాయి. ఏపీలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించాలనే డిమాండ్లు కూడా లేకపోలేదు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇతర ఆర్థికశాఖ నిపుణులు ఢిల్లీలో కేంద్రంతో పలు దఫాలుగా జరిపిన చర్చలు సత్ఫలితాలు ఇచ్చాయి. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మరో రూ.10,500 కోట్ల రుణానికి అనుమతి ఇవ్వడం సీఎం జగన్‌కు పెద్ద ఊరట కాగా, ప్రతిపక్షాలు, ఎల్లో మీడియాకు చావు దెబ్బ అని చెప్పక తప్పదు. అయితే తలకు మించి అప్పు చేయడాన్ని ఎవరూ సమర్థించరు. గతంలో భారీగా అప్పులు చేసి, ప్రజాసొమ్మును దోచుకున్నోళ్లే… నేడు జగన్ ప్రభుత్వానికి అప్పు పుట్టకూడదని కోరుకోవడం గమనార్హం.
ప్రభుత్వానికి అప్పు పుట్టకుండా, దివాళా తీయాలని కోరుకోవడం అంటే ఆంధ్రప్రదేశ్ వినాశనాన్ని కాంక్షించడమేనని మరిచినట్టున్నారు. జగన్ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తున్నా, ఆ మేరకు అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు. జగన్ ప్రభుత్వం చేస్తున్న తప్పులకు రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదు. ఎందుకంటే అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలు.