మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల పుణ్యమా అని నటీనటుల నిజ స్వరూపాలు బయటపడుతున్నాయి. ఇంత కాలం తెరపై నటించే అవకాశం వచ్చినా…రాణించలేని వారు కూడా తెర వెనుక అద్భుతంగా నటిస్తుండడం విశేషం. “మా” ఎన్నికల ఎపిసోడ్‌లో సూపర్‌డూపర్ యాక్టర్ ఎవరంటే బండ్ల గణేష్ పేరే వినిపిస్తోంది.
గత రెండు మూడు రోజులుగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బండ్ల గణేష్ వ్యవహారం మెగా ఫ్యామిలీకి ఎలా అనిపిస్తున్నదో తెలియదు కానీ, జనానికి మాత్రం అసహనం కలిగిస్తోంది. మెగా ఫ్యామిలీపైనే కాదు, ఎవరిపైనైనా ఎవరైనా అభిమానాన్ని చాటుకోడానికి ఒక పద్ధతి వుంటుంది. అది పరిధులు దాటకూడదు.
కానీ బండ్ల గణేష్ మాత్రం మెగా ఫ్యామిలీపై అనంతమైన భక్తిని, విధేయతను చాటుకునే క్రమంలో, ఇతరుల్లో అసూయ పుట్టేలా చేస్తున్నారనే అభిప్రాయాలు టాలీవుడ్‌లో వ్యక్తమవుతున్నాయి. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌లోకి జీవితా రాజశేఖర్ రావడంతో తాను తప్పుకుంటున్నట్టు బండ్ల గణేష్ ప్రకటించడం టాలీవుడ్‌లో తేనెతుట్టెను కదిలించినట్టైంది. ఎప్పుడూ జరిగిన వ్యవహారాలను మళ్లీ తెరపైకి తేవడం వెనుక బండ్ల దురుద్దేశం ఏంటనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే మెగా బ్రదర్స్ ప్రేమే తప్ప ద్వేషాన్ని పంచు తారని ఎవరూ అనుకోరు.
అలాంటిది మెగా ఫ్యామిలీకి వీరవిధేయుడిగా, పరమ భక్తుడిగా తనకు తాను ప్రకటించుకున్న బండ్ల గణేష్…. తన ఆరాధ్య హీరోల నుంచి నేర్చుకున్నదేంటో ఒక్కసారైనా అంతరాత్మను ప్రశ్నించుకున్నారా? ఒకవేళ ప్రశ్నించుకుంటే జీవితా రాజశేఖర్ విషయం లో అలా వ్యవహరించి వుండేవారు కాదు.
ఎవరైనా తాము ఆరాధించే వాళ్లకు నిజమైన భక్తులు ఎప్పుడవుతారంటే… వాళ్ల ఆశయాలకు అనుగుణంగా నడుచుకున్న ప్పుడే. చిరంజీవి, నాగబాబు, పవన్‌కల్యాణ్‌లు మదర్‌థెరిస్సా స్ఫూర్తితో సేవా కార్యక్రమాలతో పాటు వ్యక్తిగతంగా తమను తాము మనసున్న మనుషులుగా మలుచుకోవాలని భావించే మనస్తత్వం వారి సొంతం. మరి బండ్ల గణేష్ విషయానికి వస్తే, తన ఆరాధ్య హీరోల ఫిలాసఫీకి పూర్తి విరుద్ధంగా సాటి మహిళా నటిపై అక్కసును వెళ్లగక్కడంలో ఔచిత్యం ఏంటి? అని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఎన్నికల్లో ప్రత్యర్థులకు, శత్రువులకు మధ్య చాలా తేడా వుంటుంది. బండ్ల గణేష్ మాటలు వింటే జీవితా రాజశేఖర్‌ను శత్రువుగా చూస్తున్నట్టు అర్థమవుతుంది.
ఒక చానల్‌లో జరిగిన డిబేట్‌లో బండ్ల గణేష్ మాట్లాడుతూ …జీవితా రాజశేఖర్ ఎన్ని మాట్లాడినా.. మెగా ఫ్యామిలీ క్షమించ వచ్చేమో గానీ, తాను మాత్రం క్షమించలేనని తేల్చి చెప్పారు. మెగా ఫ్యామిలీ వాళ్లు గొప్పవాళ్లని, వాళ్లకు క్షమించే గుణం ఎక్కు వని, తాను అంత గొప్పవాడిని కాదని ఆయన చెప్పుకొచ్చారు. బండ్ల గణేష్ స్థాయి ఏంటో ఈ మాటలు వింటే తెలుస్తుంది. బండ్ల గణేష్ వైఖరి అనివార్యంగా మెగా ఫ్యామిలీపై నెగెటివ్ ప్రభావం పడుతుందనే ఆందోళన చిరు బ్రదర్స్ అభిమానుల్లో నెలకుంది. చేయని తప్పునకు చెడ్డపేరు మూటకట్టుకోవడం అంటే ఇదేనేమో!