సోషల్ మీడియా కత్తి లాంటిది. కత్తిని పండ్లు కోసుకోడానికి, కూరగాయలు తరగడానికి వినియోగిస్తే మంచిది. అలా కాకుండా హింసను ప్రేరేపించే కార్యకలాపాలకు వినియోగిస్తే జైలు జీవితం తప్పదు. మనుషుల ఆలోచనా విధానాలను అనుసరించి…కత్తి, కలం, తుపాకి తదితర ఆయుధాల వినియోగం ఆధారపడి ఉంటుంది. మంచికి వాడితే మంచే జరుగుతుంది. అందుకు విరుద్ధంగా చెడుకు వాడితే చెడే జరుగుతుంది.
ఓ బెల్లీ డాన్సర్ సోషల్ మీడియాను అనుచిత పోస్టులు వాడుకునేందుకు వినియోగించడంతో తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఈజిప్టుకు చెందిన బెల్లీ డాన్సర్ సామా ఎల్-మస్రీ టిక్‌టాక్, యూట్యూబ్‌లలో కొన్ని వీడియోలు, ఫొటోలు షేర్ చేసింది. అయితే ఈ పోస్టులు అనుచితంగా, లైంగిక సంప్రదాయాలను దెబ్బ తీయడంతో పాటు విచ్చలవిడి తనాన్ని ఎంకరేజ్ చేసేలా ఉన్నాయని ఆమెపై కేసు నమోదైంది.
ఏప్రిల్ 23న ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆమె పోలీసుల అదుపులోనే ఉంది. కరోనా సమయంలో నరకం అంటే ఎలా ఉంటుందో ఆమెకు పోలీసు కస్టడి అనుభవంలోకి తెచ్చింది. కాగా విచారణలో ఆమె దోషిగా తేలింది. దీంతో కైరో న్యాయస్థానం బెల్లీ డాన్సర్‌కు మూడేళ్ల జైలు శిక్షతో పాటు మూడు లక్షల ఈజిప్షియన్ పౌండ్లు (మన కరెన్సీలో రూ.14 లక్షలు) జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.
తీర్పు అనంతరం తానెంత పెద్ద తప్పు చేసిందో అర్థమైంది. దీంతో తనకేం పాపం తెలియదని, తన మొబైల్లోని వీడియోలు, ఫొటోలను ఎవరో దొంగలించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని ఆమె స్పష్టం చేసింది. ఏది ఏమైనా తప్పు జరిగిన తర్వాత మేల్కొనే కంటే, జరగక ముందే అప్రమత్తంగా ఉండడం ఎంతైనా అవసరం అని ఈ సంఘటన హెచ్చరిస్తోంది.