దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐకి కేసీఆర్ సర్కార్ షాక్ ఇచ్చింది. ఇక మీదట తెలంగాణలో సీబీఐకి నో ఎంట్రీ అంటూ తెలంగాణ ప్రభుత్వం బోర్డు పెట్టింది. తెలంగాణ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలపై సీబీఐ, ఈడీ కేసులు నమోదు అయ్యే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఏ రాష్ట్రంలోనైనా సీబీఐ దర్యాప్తు చేపట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో అనుమతి నిరాకరిస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో భవిష్యత్ పరిణామాలు ఎలా వుంటాయనే చర్చకు తెరలేచింది. తెలంగాణలో గత కొంత కాలంగా రాజకీయంగా వేడి రగిలింది.
ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్రస్థాయిలో రాజకీయ వైరం సాగుతోంది. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అంతేకాదు, ఆ పార్టీ కోర్టును కూడా ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం న్యాయస్థానం పరిధిలో వుంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉదంతంలో కేసీఆర్ తనయ కవితపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సీబీఐ విచారణ జరుపుతోంది. కొందర్ని అరెస్ట్ కూడా చేసింది. కవితను కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం విస్తృతంగా సాగుతున్న నేపథ్యంలో, సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు.
సీబీఐకి అనుమతి నిరాకరించడం వెనుక కేంద్ర ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే ఉద్దేశమా? లేక బీజేపీ బెదిరింపులను అడ్డుకునే ప్రయత్నమా? అనే అంశంపై చర్చ జరుగుతోంది.