టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఘోర పరాజయం నుంచి తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ మాత్రం గుణపాఠం నేర్చుకోలేదు. కేంద్రంలో అధికారం చెలాయిస్తూ, అత్యంత బలీయమైన శక్తిగా అవతరించిన బీజేపీపై పోరాటంలో కేసీఆర్ ఎంత వరకు సక్సెస్ అవుతారనే చర్చ జరుగుతోంది. అయితే బీజేపీ రాజకీయ పంథా తెలిసిన ప్రజానీకం కేసీఆర్ దూకుడుపై నిట్టూర్చుతోంది.
తాజాగా సీబీఐని తెలంగాణలోకి అడుగు పెట్టనివ్వకుండా కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాజకీయ పంథా గురించి విస్తృత చర్చ జరుగుతోంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీపై చంద్రబాబు యుద్ధం ప్రకటించారు. ఏపీలోకి సీబీఐని అనుమతించనంటూ చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో జీవో ఇచ్చింది.
బీజేపీని టార్గెట్ చేయడం ద్వారా, ఆ పార్టీతో సన్నిహితంగా ఉన్నాడంటూ జగన్‌ను బద్నాం చేసేందుకు నాడు చంద్రబాబు ఎత్తుగడ వేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో చంద్రబాబు చిత్తుచిత్తుగా ఓడిపోయారు. మళ్లీ బీజేపీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు చేస్తున్న సర్కస్ పీట్స్ గురించి అందరికీ తెలిసిందే.
ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చంద్రబాబు పంథానే అనుసరిస్తున్నారు. సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ జీవో జారీ చేయడమే ఇందుకు ఉదాహరణ. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థి బీజేపీ. దీంతో బీజేపీతో తాడోపేడో తేల్చుకోక తప్పనిసరి పరిస్థితి కేసీఆర్‌కు ఎదురైంది. చావోరేవో తేల్చుకోవడం తప్ప మరో మార్గం లేదని టీఆర్ఎస్ శ్రేణుల వాదన. అయితే బీజేపీపై రాజకీయ పోరాటానికి మించి, వ్యక్తిగతంగా కేసీఆర్ పోతున్నారనే అభిప్రాయం జనాల్లో కలుగుతోంది.
అదే ప్రమాదం. ఇటీవల జాతీయ పార్టీని కూడా కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది కూడా కేసీఆర్‌పై బీజేపీ టార్గెట్‌కు కారణమైంది. తెలంగాణ రాజకీయాలు భవిష్యత్‌లో ఎలాంటి మలుపులు తిరగనున్నాయో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.