కుక్కకు ఎముక దొరికినట్టుగా, ఎండిపోయిన కుక్కలా తయారైన పాకిస్తాన్ కు ఆఫ్గానిస్తాన్ దొరికినట్టుగా ఉంది. ఒకవైపు ఇమ్రాన్ ఖాన్ సారధ్యంలోని పాకిస్తాన్ దివాళా దశలో ఉంది. పేరుకు ప్రజాస్వామ్యమే కానీ.. పాకిస్తాన్ బతుకేంటో ప్రపంచానికి తెలియనిది కాదు. సైన్యం దయ చేత ఇమ్రాన్ ఖాన్ నాయకుడిగా కొనసాగుతూ ఉన్నాడు. ఇక ఆర్థిక పరమైన ఇక్కట్లు, ఇతర సమస్యల గురించి వేరే చెప్పనక్కర్లేదు.
కాస్తో కూస్తో ఆర్థికంగా కుదురుకున్న పాకిస్తానీలు ఇంగ్లండ్, గల్ఫ్ లకు తరలిపోవడమే జీవితధ్యేయంగా సాగుతోంది అక్కడ మనుగడ. ఇండియాను బూచిగా, కశ్మీర్ ను తమ సమస్యగా చూపిస్తూ.. ఇమ్రాన్ ఖాన్ బండి లాగిస్తున్నాడు. అంతకు మించి చేయగలిగింది కూడా ఏమీ లేదు.
అయితే ఇంతలో ఈ బక్కచిక్కిన కుక్కకు ఒక ఎముక లభించింది. అదే ఆఫ్గానిస్తాన్. అమెరికా అక్కడ బిచాణా ఎత్తేసిన తర్వాత శల్యంగా మారిన ఆఫ్గానిస్తాన్ నుంచి ఏమైనా రక్తం పీల్చుకోవడానికి దొరుకుతుందేమో అని పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయంలో దాపరికం కూడా ఏమీ లేకుండా ఐఎస్ఐ చీఫ్ ఆఫ్గాన్ లో దిగాడు. అక్కడ తాలిబన్లకూ, హక్కానీలకూ సయోధ్య కుదిర్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ఆయన తక్షణ కర్తవ్యంలాగుంది.
మరోవైపు పాకిస్తాన్ జోక్యం పట్ల ఆఫ్గాన్ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాలిబన్లను అయినా భరించవచ్చు కానీ, పాక్ ను భరించలేమన్నట్టుగా వారు ఫీలవుతున్నారు పాపం. అందుకే ఎంతో ధైర్యం చేసి రోడ్ల మీద నిరసనలకు దిగారు. కానీ వారిపై తాలిబన్లపై తుపాకుల మోగాయి. ఆందోళనకారులపై కాల్పులు జరిపారు తాలిబన్లు. ఇలా పాక్- తాలిబన్ల మైత్రి తేటతెల్లం అవుతోంది.
పాకిస్తాన్ విఫలదేశం స్థితిలో ఉంది. ఏ ప్రజాందోళనలో ఎగసి ఇమ్రాన్ ను తరిమికొట్టినా కొట్టవచ్చు. సైన్యానికి సీటు మీద మనసు పడినా అదే గతి. ఇలాంటి నేపథ్యంలో.. ఆఫ్గానిస్తాన్ ను తామే ఏలుతున్నట్టుగా కలరింగ్ ఇచ్చి.. పాకిస్తానీయులను పిచ్చివాళ్లుగా చేసే ప్రయత్నంలాగుంది ఇది. పనిలో పనిగా ఇండియాపై ఉగ్రవాదాన్ని పురికొల్పడానికి కూడా పాక్ కు ఆఫ్గాన్ ఆటస్థలంగా మారవచ్చు. గతంలో భారత విమానం హైజాక్ లో కాందహార్ ను ఐఎస్ఐ ఎలా వాడుకుందో తెలిసిందే. ఆఫ్గాన్ ను వీలైనంతగా కుక్కలు చింపిన విస్తరిగా చేయడానికి తాలిబన్లకు తోడు పాక్ తయారైంది. వీళ్ల దాష్టికాలు ముందు ముందు ఇంకా ఎలా ఉంటాయో!