జనసేన అంటే వీకెండ్స్ రాజకీయ పార్టీ అని పేరు తెచ్చుకుంది. చంద్రబాబుతో భేటీ తర్వాత పవన్‌కల్యాణ్ ఆచూకీ లేదు. ఆయనే కాదు, జనసేన కార్యకలాపాలు కూడా ఏవీ లేవు. అప్పుడప్పుడు పవన్‌కల్యాణ్ కనిపించడం, మీడియాకు కాస్త మేత పెట్టడం, ఆ తర్వాత పత్తా లేకపోవడం పరిపాటైంది. ఇలాగైతే రాజకీయంగా బలపడడం అసాధ్యం.
రాజకీయం అంటే నిత్యం ప్రజల్లో వుండాలి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రజలకు నమ్మకం కలిగించేలా నాయకుడు మెలగాలి. జనసేనాని పవన్‌కల్యాణ్ రాజకీయ పంథా చూస్తే… ఎంతసేపూ జగన్‌పై ధ్యాసే. వైఎస్ జగన్‌ను ఎప్పుడు గద్దె దించుదామా? అని పవన్ ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. పోనీ ఆ లక్ష్యంతోనైనా రాజకీయంగా గట్టిగా పని చేస్తున్నారా? అంటే … లేదనే సమాధానం వస్తోంది.
ఇవాళ జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం చేపట్టడం ఆసక్తి కలిగిస్తోంది. చంద్రబాబుతో భేటీ నేపథ్యంతో టీడీపీ, జనసేన పొత్తు కుదుర్చుకుంటాయనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. మరోవైపు జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని బీజేపీ నేతలు పదేపదే చెబుతున్నారు. కనీసం మిత్రపక్షమైన బీజేపీకి క్లారిటీ ఇచ్చేందుకైనా జనసేనాని వాస్తవాలు చెప్పాల్సిన అవసరం వుంది.
ఇవాళ్టి సమావేశంలో పార్టీ బలోపేతంపై పవన్ దిశానిర్దేశం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీతో లేదా బీజేపీతో పొత్తులో వుంటే పార్టీ బలపడుతుందనే భ్రమ నుంచి పవన్ బయటికి రావాలి. ప్రజాసమస్యలపై పోరాటాలు, ప్రజలతో మమేకం కావడం తప్ప, జనసేన బలోపేతానికి సులువైన మార్గాలు వుండవు. ఆ వాస్తవాన్ని గ్రహించి జనసేన శ్రేణులకి దిశానిర్దేశం చేస్తే మంచిది. వీకెండ్స్ నుంచి రెగ్యులర్ మీటింగ్ నిర్వహించే రోజు ఎప్పుడైతే వస్తుందో, అప్పుడే ఆ పార్టీకి మంచి కాలం వచ్చినట్టు భావించాలి.