ఫిరాయింపులపై వెంకయ్య సూక్తులు కొనసాగింపు!

'పార్టీ ఫిరాయింపులపై కఠిన చర్యలు తీసుకోవాలి..' అని అంటున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఇటీవలే తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి ఫిరాయించిన నలుగురికి ఆమోదముద్ర వేసింది ఈసారే. అయితే ఇప్పుడు పార్టీ…

'పార్టీ ఫిరాయింపులపై కఠిన చర్యలు తీసుకోవాలి..' అని అంటున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఇటీవలే తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి ఫిరాయించిన నలుగురికి ఆమోదముద్ర వేసింది ఈసారే. అయితే ఇప్పుడు పార్టీ ఫిరాయింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నదీ ఆయనే. దీంతో ఈ ప్రకటనతో బాగా ఆశ్చర్యపోతున్నారు సామాన్య ప్రజలు.

చాన్నాళ్లుగానే ఫిరాయింపు రాజకీయాలను వెంకయ్య నాయుడు నిరసిస్తూ ఉన్నారు. రాజ్యసభలో పార్టీల వాణికి వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై అనర్హత వేటు కూడా వేశారు. అలా ఇద్దరు ఎంపీలను అనర్హులుగా చేశారాయన. అయితే ఇటీవలే తెలుగుదేశం నుంచి నలుగురు ఫిరాయిస్తే వారికి మాత్రం ఆమోదముద్ర వేశారు!

రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ బీజేపీలోకి విలీనం అయిపోయిందన్నారు. అలాంటి విలీనాలు వివాదాలే. విలీనం ఏదైనా అది ఎన్నికల కమిషన్ ద్వారా జరగాలి కానీ, చట్టసభలో నేతల ఫిరాయింపులు విలీనాలు కావని రాజ్యాంగ నిపుణులు చెబుతూ ఉన్నారు. ఇక తెలుగుదేశం నుంచి బీజేపీలోకి చేరినవారు కూడా కేవలం అవకాశవాదంతో చేరారు తప్ప మరో విధానం ఏమీలేదనే అభిప్రాయాలూ వినిపించాయి.

అలాంటి పరిస్థితుల్లో కూడా వెంకయ్య నాయుడు ఆ విలీనానికి ఆమోదముద్ర వేశారు. ఆ ఫిరాయింపులను విలీనం అన్నారు. ఆ విషయంలో విమర్శలు వచ్చాయి కూడా. అయితే ఇప్పుడు ఆయనే మళ్లీ పార్టీ ఫిరాయింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇంతకీ ఈమాట వెంకయ్య నాయుడు ఎవరికి చెప్పినట్టు? అంటూ సామాన్య ప్రజానీకం చర్చించుకుంటోంది!

అమరావతిలో భూములు కొన్న నేతల హడల్!