జగన్…జర జాగ్రత్త!

పాలన ఎలా సాగుతున్నదో.. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నదో.. తెలుసుకోడానికి ఇప్పుడు ఎలాంటి ఎన్నికలూ లేవు! ఏవైనా చిన్నా సన్నా ఎన్నికలు వచ్చినా.. అవి వాస్తవమైన ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించేంత నిజాయితీగా, పారదర్శకంగా జరుగుతాయనే గ్యారంటీ కూడా…

పాలన ఎలా సాగుతున్నదో.. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నదో.. తెలుసుకోడానికి ఇప్పుడు ఎలాంటి ఎన్నికలూ లేవు! ఏవైనా చిన్నా సన్నా ఎన్నికలు వచ్చినా.. అవి వాస్తవమైన ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించేంత నిజాయితీగా, పారదర్శకంగా జరుగుతాయనే గ్యారంటీ కూడా లేదు. కానీ.. ప్రజలనాడిని తెలుసుకోవాల్సిన తక్షణావసరం మాత్రం ఉంది.

ప్రభుత్వం ఏర్పడి మూడున్నరేళ్లు దాటాయి. మరోసారి ఈ అవకాశం దక్కించుకోడానికి ప్రజల తీర్పును ఎదుర్కోవాల్సిన దూరం ఎంతో లేదు. ఇప్పటికైనా ప్రజల నాడి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అంతకంటె ముఖ్యం.. నిష్పాక్షిక ఆత్మపరిశీలన! ఇంటెలిజెన్స్ వేగులు అందించే నాడిని నమ్మకూడదు.. భజనపరుల సమూహం నడుమ కూర్చుని ఆత్మపరిశీలనకు యత్నించకూడదు!

ఒక యోగంలా.. ఒక తపస్సులా.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంతర్లోచనుడై మంచి చెడులను తూకం వేసుకోవాలి. పాలనలో దొర్లిన లోపాలను జల్లెడ పట్టాలి. వాటిని జాగ్రత్తగా గుర్తుంచుకుని, దిద్దుకోవాలి. ‘లోపాలే లేని పాలన మాది’ అని, ‘ఊరూరా బ్రహ్మరథం పడుతున్న జనాదరణతో 175 సీట్లు గెలవబోతున్నాం’ అని బాహ్యప్రపంచానికి చెప్పడం బాగానే ఉంటుంది. కానీ, ఆత్మవంచన లేని ఆత్మపరిశీలన అవసరం!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికల సీజన్ వచ్చేసింది. అన్ సీజనల్ ఎన్నికల మూడ్ ఇది. సాధారణంగా చివరి ఆరునెలల్లో ఎన్నికల మూడ్ ఉండడం సహజం. కానీ ఈ దఫా ఏడాదిన్నర ముందుగానే ఎన్నికల మూడ్ రాష్ట్రాన్ని ఆవరించింది. ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత.. ముఖ్యమంత్రి తానుగా వద్దని అనుకుంటే తప్ప అయిదేళ్లపాటూ నిరాటంకంగా పదవిలో ఉండగల వెసులుబాటు ఉన్నది గనుక, ఊరుకుంటున్నారు గానీ.. ఏ చిన్న సందు దొరికినా.. తక్షణం జగన్ చేతుల్లోంచి అధికారాన్ని లాక్కుని కుర్చీ ఎక్కాలని నారా వారూ.. వారి దత్తపుత్రుడూ తెగ ఉబలాటపడుతున్నారు. వారి ఆతురతకు హద్దులేదు. 

నాలుగేళ్ల కిందట ఎన్నికల ప్రచారంలో ఒకరినొకరు పచ్చిగా తిట్టుకున్నవాళ్లు ఇప్పుడు సిగ్గులేకుండా కరచాలనాలకు, ఆలింగనాలకు సిద్ధమవుతున్నారు. చంద్రబాబును మించిన వేస్ట్ ఫెలో లేడని, పరిపాలన చేతకానివాడని దుమ్మెత్తి పోసిన దత్తపుత్రుడే.. ఆనాడు తన మాటలు నమ్మిన ప్రజలను వెర్రివెంగళాయిలను చేస్తూ ఇవాళ మళ్లీ ఆయన పల్లకీ మోయడానికి సిద్ధపడుతున్నాడు! వీరి సంగతి ఎలా ఉన్నదనేది తర్వాతి సంగతి.. మరి ఏ యుద్ధాన్నయినా సరే ఒంటరిగా మాత్రమే ఎదుర్కొనే తెగువ, ధైర్యం, ధీరత ఉన్న నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ఏమాత్రం సన్నద్ధం అవుతున్నారు. 

‘అంతా బాగుంది’ నిజమే కానీ.. 

జగన్ ప్రభుత్వం చాలా సంతృప్తిగా భావించగల అంశం ఇది. ‘ఎన్నికలకు– ఎన్నికలకు మధ్య.. ఎన్నికైన నాయకులు నియోజకవర్గంలో ప్రజలకు కనిపించరు’ అనే సాంప్రదాయ జనం నమ్మకాలను పటాపంచలు చేస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున ఎన్నికైన నాయకులు.. ఇవాళ ప్రతి గడపకూ తిరుగుతున్నారంటే.. దాని వెనుక ఉన్న ఏకైక విశ్వాసం.. ‘అంతా బాగుంది’ అన్నదే! ప్రభుత్వం అద్భుతమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. రాష్ట్రంలో పార్టీలతో నిమిత్తం లేకుండా, కులమతాలు వర్గాలతో నిమిత్తం లేకుండా అర్హమైన ప్రతి ఇంటికీ ప్రభుత్వపరంగా ఏదో ఒక సాయం అందుతోంది. ఆ నమ్మకమే నాయకులను ప్రజల వద్దకు ధైర్యంగా తీసుకువెళుతోంది. 

జగన్ పరిపాలన పట్ల, ఆయన ప్రతి సందర్భంలోనూ చెప్పుకునేట్లుగా, ప్రతి కుటుంబంలోనూ తాను కూడా ఒక సభ్యుడు అయినట్టుగా, ప్రతి ఇంటి బాగు కోసం చేపడుతున్న సంక్షేమపథకాల పట్ల అందరూ సంతృప్తిగా ఉన్నారు. ‘సంక్షేమం అంటే ప్రతి పేదవాడికీ, నేరుగా తన చెంతకే ప్రభుత్వ సాయం అందడం’ అనే సరికొత్త నిర్వచనాన్ని ప్రజలు ప్రతి ఒక్కరూ అనుభూతిస్తున్నారు. రేషను ఎన్నడు వచ్చిందో లేదో తెలియని, తమ దగ్గర డబ్బు సర్దుబాటు అయి డీలరు వద్దకు వెళ్లేలోగా రేషను మొత్తం ‘అయిపోయింది’ అనే జవాబులను విని.. ప్రజలు సుదీర్ఘకాలంగా అలసిపోయి ఉన్నారు. అలాంటిది.. ఇవాళ రేషన్ సరుకులు అనేవి.. ఇళ్లవద్దకే వచ్చి అందుతున్నాయి. వృద్ధులకు ఒకటో తారీఖుకల్లా పెన్షను డబ్బు ఇంటివద్దకే వచ్చి ఇచ్చి వెళుతున్నారు. 

ఇవన్నీ ప్రజల ఊహకైనా అందని పద్ధతులు. జగన్ దార్శనికత ఫలితాలైన ఈ సంక్షేమ సుఫలాల్ని వారు ఆస్వాదిస్తున్నారు. అన్ని వర్గాల్లో ఏదో ఒక రూపేణా ధనసహాయం ప్రభుత్వం నుంచి అందుతోంది. వందల వేల కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి జగన్ తమకు ఇవ్వదలచుకుంటే.. ఒక్క బటన్ నొక్కి తమ అందరి ఖాతాల్లోకి పంపేయగలుగుతున్నారని జనం సంతోషంగానే ఉన్నారు.

‘అంతా బాగుంది’ అనే భావన నిజమే. కానీ.. ఒక ప్రభుత్వం నుంచి ప్రజలు ఆశించేది ఇదొక్కటీ మాత్రమేనా? కేవలం ఈ వితరణ, డబ్బురూపేణా అమలవుతున్న సంక్షేమ పథకాలు ప్రభుత్వాన్ని మళ్లీ మళ్లీ గెలిపిస్తూ ఉంటాయా? ఇలా డబ్బులిచ్చే ప్రభుత్వం కలకాలమూ పచ్చగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు నిజమే కానీ.. తమ జీవితాలకు సంబంధించి ఇంకేమైనా బాగు జరగాలని ప్రభుత్వంనుంచి ప్రజలు ఆశించడం తప్పు అనిపించుకుంటుందా? ఆ దిశగా ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకుంటున్నదా లేదా?

మౌలిక వసతుల సంగతేంటి?

రాష్ట్రంలో రోడ్లు ఎలా ఉన్నాయి. ప్రతి పక్షాలు లేదా పచ్చ మీడియా ప్రతి విషయాన్ని కూడా భూతద్దంలో చూపిస్తుంటాయి. వారు ప్రతి సమస్యకు కాస్త అతిశయం అతికించి ప్రజల్లోకి వదులుతుంటారని నమ్ముదాం. కానీ.. రోడ్ల పరిస్థితి ఎంతో కొంత దౌర్భాగ్యంగానే ఉన్నదని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిందే. ప్రత్యేకించి కొన్ని గ్రామీణ రోడ్లలో కొత్తగా వచ్చే కార్లు లాంటి వాహనాల వారిని గ్రామస్తులు ఆపి ఈ రోడ్డమ్మట లారీలు కూడా వెళ్లలేవు.. కారు వెళ్లడం కష్టం.. ఇంకోదారి చూసుకోండి అని చెప్పడం చాలా చోట్ల జరుగుతూ ఉన్న వాస్తవం. ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న, సచివాలయం, శాసనసభ కొలువుదీరి ఉన్న ప్రాంతానికి చుట్టుపక్కలే ఇలాంటి దుస్థితి ఉన్నది. అలా చెబుతున్న వారంతా విపక్షాల తైనాతీలు అని బుకాయించడానికి వీల్లేదు. నిజంగానే చాలా గ్రామీణ రోడ్లు కార్లు వెళ్లడానికి ఏమాత్రం అనువుగా లేవు, వెళితే రిపేర్లకు గురికాకుండా కార్లు తిరిగి రావు. 

రోడ్ల విషయంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఎలాంటి నిర్లక్ష్యం అంటే.. ప్రతిపక్షాలు రోడ్ల దుస్థితిని ఎడ్వాంటేజీగా మార్చుకోగలిగినంతటి నిర్లక్ష్యం! తెలుగుదేశం, జనసేన రెండూ ఈ అవకాశాన్ని బాగా వాడుకున్నాయి. పవన్ కల్యాణ్.. తాను సొంత ఖర్చుతో రోడ్లు బాగు చేయిస్తానంటూ.. ఒక సుదీర్ఘమైన డ్రామాను కూడా రక్తి కట్టించాడు. ప్రభుత్వం తనంతగా రోడ్ల మరమ్మతులు ప్రారంభిస్తే.. ‘నన్ను చూసి భయపడి రాత్రిళ్లు రోడ్ల రిపేర్లు చేస్తున్నారంటూ’ ఎగస్ట్రాలు పలికాడు. పగలు ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా చాలా వరకు రోడ్ల రిపేర్లు రాత్రి మాత్రమే చేస్తారనే కామన్ సెన్స్ లేని మాటలే అవి. కానీ.. అలాంటి అతిశయమైన ఓవరాక్షన్ మాటల ద్వారా ప్రభుత్వం మీద బాగానే బురద చల్లగలిగాడు. ప్రజలు నమ్మారు కూడా. ఎందుకంటే.. కేవలం పవనో, చంద్రబాబో చెప్పాడని మాత్రమే కాదు.. ఎన్ని రోడ్ల రిపేర్లు ప్రభుత్వం చేసినా.. ఇంకా తమ స్వానుభవంలో ప్రతిరోజూ నికృష్టమైన రోడ్లు తగులుతున్నాయి కాబట్టి!

కరెంటు చార్జీలు పెంపు అనేది కూడా రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభావితం చేసే ఒక కీలకమైన సంగతి. ఎక్కడ ఎలా అదుపు తప్పిపోతోందో తెలియదు గానీ.. కరెంటు చార్జీలను అనూహ్యంగా పెంచేసుకుంటూ పోవడం, చెల్లింపుల్లో రవ్వంత ఆలస్యమైన కనెక్షన్ కత్తిరించడం, రీ కనెక్షన్ పేరిట భారీగా వడ్డిస్తుండడం ఇవన్నీ ప్రజలను ఇబ్బంది పెడుతున్న అంశాలు. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టడం కూడా ఇలా ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే పనుల్లాంటిదే. 

పొరుగు రాష్ట్రం తెలంగాణ వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టడాన్ని ధిక్కరించి.. రైతుల మన్ననలు పొందింది. కానీ.. ఏపీ ప్రభుత్వం చాలా పట్టుదలగా మీటర్లు ఏర్పాటు చేయించే ప్రయత్నాల్లో ఉంది. మీటర్లు పెట్టినంత మాత్రాన మీకేం నష్టం లేదు. ఉచిత విద్యుత్తు యథాతథంగా ఉంటుంది.. అని ప్రభుత్వం ఎంతగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. ప్రజల్లో భయం చాలానే ఉంది. పైగా విపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు కూడా.. వీటిని వ్యతిరేకించకుండా అతి తెలివి ప్రదర్శిస్తున్నాడు. ఇప్పుడు వ్యతిరేకిస్తే.. రేపు ఖర్మగాలి తన ప్రభుత్వం ఏర్పాటైతే తీసేయాల్సి వస్తుందని.. ఆ పాపం ఏదో జగన్ నే అనుభవించినవ్వమని ఆయన కుట్రపూరిత మౌనం పాటిస్తున్నారు. అయినా జగన్.. రైతుల్లో మీటర్ల భయం పెంచడానికే తెగిస్తున్నారు. 

ఇలాంటి కీలక అంశాల గురించి పార్టీ గానీ, ప్రభుత్వం గానీ ఎన్నడు పట్టించుకుంటుంది? సార్వజనీనంగా ప్రజల ఆలోచనల్ని పార్టీ రహితంగా ప్రభావితం చేయగల ఇలాంటి సమస్యల వలన.. తాము చేపడుతున్న సంక్షేమ పథకాలు బూడిదలో పోసిన పన్నీరు కాగల ప్రమాదం ఉంటుందని ప్రభుత్వం ఎందుకు గుర్తించలేకపోతోంది? ప్రజలకు సంక్షేమం రూపంలో డబ్బు ఇస్తున్నందుకు.. మరే ఇతర విషయాన్నీ పట్టించుకోరు అనుకుంటే మాత్రం భ్రమ! పునరాలోచనలు, దిద్దుబాటు చర్యలు తప్పనిసరి!

‘విధ్వంసక’ ముద్ర తగదు..

మంచో చెడో.. అధికారంలోకి వచ్చిన దూకుడులో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రభుత్వానికి శాశ్వతమైన చెడ్డపేరు తెచ్చాయి. వాటిలో అన్న క్యాంటీన్ల ఎత్తివేత పెద్ద ఉదాహరణ. పాలకులు మారినప్పుడు పథకాలకు పేర్లు మారడం ప్రజలకు కొత్త సంగతి కాదు. అదే క్యాంటీన్లకు వైఎస్సార్ క్యాంటీన్లని పేరు పెట్టి ఉంటే.. ప్రతిపూటా కొన్ని లక్షల మంది నిరుపేదలు.. వైఎస్సార్ పేరు చెప్పుకుని.. కడుపు నింపుకుంటూ ఉండేవారు. ఆ అవకాశాన్ని జగన్ మిస్ చేసుకున్నారు.

నిజానికి తెలుగుదేశం పాలనలో అన్న క్యాంటీన్లు నిర్వహించిన రోజుల్లో వాటికి పోటీగా, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, అప్పటికి ఎమ్మెల్యే ఆశావహులు అనేకచోట్ల పోటీగా తాము కూడా ఉచితంగాను, అంతకంటె తక్కువ ధరకు (నామమాత్రంగా) క్యాంటీన్లను నిర్వహించారు. పేదల కడుపు నింపే ఆ ఆలోచనలు వారికి మేలే చేశాయి. అలాంటిది అన్న క్యాంటీన్లను ఎత్తివేస్తున్న సందర్భంలో.. ఇందులో లోపాలున్నాయని, మరింత మెరుగైన విధానంలో పేదలకు అన్నం పెట్టే ఆలోచన చేస్తామని మంత్రులు ప్రకటించారు. ముఖ్యమంత్రి ఎప్పటిలాగానే అప్పుడు కూడా మౌనమే పాటించారు. కానీ సదరు మెరుగైన విధానమేంటో ఇప్పటిదాకా తేలలేదు. అన్న క్యాంటీన్ల భవనాలు చాలా వరకు గ్రామసచివాలయాలయ్యాయి. మిగిలినవి కూలిపోయాయి. 

కానీ, అన్న క్యాంటీన్ అనేది ప్రజలను ఆకర్షించగల ఓటు బ్యాంకు పెంచగల టెక్నిక్ అని నమ్మిన తెలుగుదేశం.. అక్కడక్కడా తమ సొంత డబ్బుతో ప్రారంభిస్తే.. వైఎస్సార్ సీపీ నాయకులు వాటి మీద దాడులు చేయడం, వాటిని కూల్చేయడం లాంటి పనులు కూడా చేశారు. ఎందుకలా చేశారు? అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు.. అంటే ఇది కాక మరేమిటి? నియోజకవర్గాల్లో అక్కడక్కడా.. అన్న క్యాంటీన్ అనే టెక్నిక్ ముసుగులో తెలుగుదేశం ప్రతిరోజూ కొందరికి అన్నం పెట్టినంత మాత్రాన.. తమ ప్రభుత్వం ఇన్నాళ్లుగా చేపడుతున్న వేల లక్షల కోట్ల సంక్షేమ పథకాల ప్రభావం మొత్తం మంటగలిసిపోయి ఓటమి పాలవుతామని ప్రభుత్వం భయపడుతోందా? తమ సంక్షేమ పథకాల పట్ల వారికి విశ్వాసమే లేదా? అన్నం పెట్టే వ్యవహారాన్ని కూడా ఎందుకు అడ్డుకుంటున్నారు? నాయకులతో నిమిత్తం లేకుండా.. స్థానిక కార్యకర్తలు అలాంటి దుడుకుపనిచేశారనుకుందాం.. వారిని నాయకులు నియంత్రించలేకపోవడం కూడా తప్పే కదా?

వైసీపీ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశానికి చెందిన వారి అనేక అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఆ పార్టీ ఎంతగా విలపించినా.. ఆ కూల్చివేతలు తప్పని అనలేం. కానీ, ఆ కూల్చివేతలకు ముడిపెట్టి.. విధ్వంసక పాలన సాగుతోందనే అపప్రధను ప్రచారంలో పెట్టారు. ప్రజలు ఆ ప్రచారాన్ని ఒక పట్టాన నమ్మేవారు కాదేమో. కానీ.. అన్న క్యాంటీన్లను కూడా ఇప్పటికీ కూల్చేస్తోంటే.., పాలన విధ్వంసక మార్గంలోనే నడుస్తున్నదనే అభిప్రాయం ఎవరికైనా కలగకుండా ఉంటుందా? ప్రభుత్వం అనవసరమైన విద్వేష రాజకీయాలను ఎందుకు ఆశ్రయిస్తున్నదనే పునరాలోచన తటస్థ ప్రజల్లో పుట్టినా సరే.. ఆ నష్టం భరించాల్సింది ఎవరు?  పార్టీ మరియు ప్రభుత్వమే కదా? మళ్లీ తాము అధికారంలోకి రావాలని కోరుకుంటున్నవారు, దశాబ్దాల పాటూ ప్రజలకు అధికారంలో ఉండే సేవ చేయాలని కలగంటున్న వారు.. ఈ ప్రతికూలతల గురించి ఎందుకు ఆలోచించడం లేదు?

ముఠా తగాదాలను ఉపేక్షిస్తారా?

అధికారంలో ఉన్న పార్టీకి నియోజకవర్గాల్లో ముఠాల, గ్రూపుల బెడద పుష్కలంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అయితే.. ఇలాంటి ముఠాలను పెంచి పోషిస్తుంటుంది. పార్టీ నాయకులు ముఠాలుగా కుమ్ములాడుకుంటూ ఉంటేనే అధిష్టానంగా తాము చెలామణీ  కావడానికి వీలుగా ఉంటుందనేది వారి వ్యూహమా అన్నట్టుగా ఆ పార్టీ రాజకీయం సాగుతుంటుంది. ‘కాంగ్రెస్’ అనే పదం తమ పార్టీ పేరులో కూడా ఉన్నందుకు.. వైఎస్సార్ కాంగ్రెస్ కూడా ముఠాలను ఉపేక్షిస్తున్నదా అనే అభిప్రాయం పలువురిలో కలుగుతోంది. 

నిజం చెప్పాలంటే రాష్ట్రంలోని దాదాపుగా ప్రతి నియోజకవర్గంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపులున్నాయి. మామూలుగా ఏకధ్రువ ప్రపంచంగా వర్ధిల్లే, వ్యక్తిస్వామ్య పార్టీ.. కేవలం జగన్ మోహన్ రెడ్డి చరిష్మా మీద మాత్రమే ఆధారపడి మనుగడ సాగించే పార్టీలో.. కిందిస్థాయిలోను, క్షేత్రస్థాయిలోను ఉండే నాయకులు తమ చిత్తమొచ్చినట్లుగా తోక జాడించడానికి అవకాశం ఉండకూడదు. కానీ.. ఎందుకోగానీ.. వైసీపీలో అలాంటి వైఖరి ప్రబలుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కాస్త వాస్తవిక దృక్పథంతో, ఈగోలకు పోకుండా అర్థం చేసుకోవాల్సిన సంగతి ఒకటుంది. 

పార్టీలో గ్రూపులు పెచ్చరిల్లుతున్నాయంటే.. ఆ పార్టీ నాయకుడు బలహీనుడని అర్థం! అంతిమంగా అది తన బలహీనత కిందికే వస్తుందనే సత్యాన్ని ఆయన అంగీకరించాలి. లేకపోతే ఫలితాల్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. రాష్ట్రం పొడవునా.. దాదాపుగా ప్రతి చోటా ఈ ముఠాలు మామూలే అయినప్పటికీ.. వాటి తీవ్రతను అర్థం చేసుకోవడానికి మచ్చుకు ఒకటి ప్రస్తావించుకుందాం. నగరి ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి రోజా.. తొలినుంచి లోకల్ గా అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. తాజాగా జగన్ ను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు కూడా. అయితే ఆమె పితూరీలు లోకల్ లీడర్ల మీదే అయినప్పటికీ.. వెనుక ఉన్న సూత్రధారి మంత్రి పెద్దిరెడ్డి అనేది జగమెరిగిన సత్యం. ఇద్దరుమంత్రులే ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వుతూ, ముఠాలను ప్రోత్సహిస్తూ కుమ్ములాడుకుంటోంటే.. పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా జగన్ చోద్యంచూస్తున్నారా? ఎంత దయనీయమైన పరిస్థితి ఇది?

ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలకు తన పార్టీని సిద్ధం చేసే ముందు ఆత్మపరిశీలన చేసుకోవడం అత్యావశ్యకం. ‘‘ఆత్మవంచన లేని ఆత్మ పరిశీలన’’ అనేది తప్పనిసరిగా పునరుద్ఘాటించవలసిన ముఖ్యాంశం. అలాంటి ఆత్మపరిశీలన సవిస్తరంగా, సకల కోణాల్లోంచి జరగాలి. ఈ కథనంలో ప్రస్తావించినవి మచ్చుకు కొన్ని అంశాలు మాత్రమే. ప్రజాశ్రేయస్సును కోరుకునే పార్టీ.. ప్రజలకోసం అయినా సరే.. మరోసారి అధికారంలోకి రావడం అవసరం! కానీ.. రాజకీయంగా ఎదురుకాగల ప్రతికూలతలను కూడా చక్కదిద్దుకుంటూ ముందడుగు వేయడం అంతే అవసరం.

.. ఎల్. విజయలక్ష్మి