ఒక రాష్ట్రానికి రాజధాని అనేది పరిపాలన వ్యవహారాలు చూడడానికి ఉద్దేశించిన కేంద్ర స్థానం. పరిపాలనకు సంబంధించిన నిర్ణయాలు మాత్రమే అక్కడ జరుగుతాయి. ఆ నిర్ణయాల అమలు క్షేత్రస్థాయిలో మాత్రమే ఉంటుంది. ఆ నిర్ణయాలు తాలూకు సాధకబాధకాలు, కష్ట నష్టాలు అన్నీ కూడా క్షేత్రస్థాయిలోనే తేల్చుకోవలసి ఉంటుంది. అయితే పద్ధతి ప్రకారం చూసినప్పుడు ప్రజలలో ఏ ఒక్కరికి కూడా రాష్ట్ర రాజధానికి వెళ్లి తమ సమస్యలను పరిష్కరించుకోవలసిన అవసరం లేదు, ఉండదు.
రాష్ట్ర రాజధానిలో విధాన నిర్ణయాలు మాత్రమే జరుగుతాయి. ఉదాహరణకు 300 యూనిట్లు కరెంటు దాటినప్పుడు ఆ గృహస్థుకు వృద్ధాప్య పెన్షన్ రాదు అనే నిబంధన వచ్చింది అనుకుందాం. ఈ నిబంధన సబబేనా కాదా అనే చర్చ శాసనసభలో జరుగుతుంది. అంటే శాసన రాజధాని లో జరుగుతుంది. సభామోదం తరువాత నిర్ణయం ప్రభుత్వ ఉత్తర్వుగా ఎగ్జిక్యూటివ్ రాజధాని లో జరుగుతుంది.
ఎక్కడో చిత్తూరు జిల్లా కుప్పంలో ఒక కుటుంబానికి ఈ ఉత్తర్వుల వలన ఇబ్బంది కలిగినట్లయితే.. ఆ కష్టం చెప్పుకోవడానికి వాళ్లు శాసన రాజధానికి గాని, కార్యనిర్వాహక రాజధానికి గాని వెళ్లవలసిన అవసరం లేదు. తమ మండల కేంద్రంలో ఉండే తహసీల్దారుకు చెప్పుకుంటే సరిపోతుంది. నిజానికి సరికొత్త వ్యవస్థలో… ప్రభుత్వ యంత్రాంగాన్ని పంచాయితీ స్థాయికి అంతకంటే కింది స్థాయికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వికేంద్రీకరించిన, అందుబాటులోకి తెచ్చిన నేపథ్యంలో తహసీల్దారు వరకు వెళ్లడం కూడా తప్పనిసరి కాదు.
మన ఊర్లోనే ఉండే వాలంటీర్ కు, పంచాయతీ సెక్రటరీ లాంటి వాళ్ళకి సమస్య చెప్పుకొని.. అర్జీ ఇచ్చేసి, తమ కోరిక చట్టబద్ధమైనదైతే పరిష్కారం దానంతట అదే వస్తుందని ఆశించవచ్చు. సమస్య పరిష్కారం కావడంలో ఆలస్యం జరిగితే.. అధికారంలో ఉండే పార్టీల నాయకులను నిలదీయవచ్చు. ఏ పార్టీ కూడా చేయని విధంగా అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరిగే వ్యవస్థ ఇప్పుడు మాత్రమే మనం చూస్తున్నాం. వాస్తవమైన సమస్యలను ప్రజలు వారితో చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇలాంటి పకడ్బందీ ఏర్పాట్లు ఉండగా ఎవరికైనా సరే రాజధానికి నేరుగా వెళ్ళవలసిన అవసరం ఏముంటుంది? అనేది పెద్ద ప్రశ్న.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కార్ అమరావతిలో శాసన రాజధానిని, విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అడ్డగోలుగా వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ మౌలికమైన సత్యాన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడుతుండడం శోచనీయం. అధికార వికేంద్రీకరణతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పిస్తే.. తెలుగుదేశం పార్టీ దానికి అడ్డం పడుతున్న వైనం ప్రజలందరూ గమనిస్తున్నారు. అందుకే మూడు రాజధానులకు అనుకూలంగా అన్ని ప్రాంతాలలోనూ ప్రజాగళం వెల్లువెత్తుతోంది. రాయలసీమలో కూడా ఇలాంటి సభ నిర్వహించిన తర్వాత.. తెలుగుదేశం మాజీ మంత్రి అమర్నాథరెడ్డి తన భాష్యం జోడిస్తున్నారు. సీమలోని సామాన్యులు విశాఖకు ఎలా వెళతారు అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
ఆ మాటకొస్తే సీమలోని సామాన్యులకే కాదు, సంపన్నులకైనా సరే రాజధాని వరకు నేరుగా వెళ్ళవలసిన అవసరం ఏముంటుంది? ప్రత్యేకించి పైరవీలు చేసుకునే వాళ్ళు తప్ప రాజధానికి నేరుగా వెళ్లే అవసరం ఏ పౌరుడికి కూడా ఉండదు! దేశ రాజధాని ఢిల్లీలో ఉంటే.. కన్యాకుమారిలోని సామాన్య పౌరుడు తన పనుల కోసం ఢిల్లీకి ఎలా వెళ్లగలడు అని అర్థం లేకుండా ప్రశ్నిస్తే ఎలాగ?
రాజధాని.. పరిపాలన కేంద్రం అనే మౌలిక స్వరూపం మీద అవగాహనే లేని అజ్ఞానంతో తెలుగుదేశం నాయకులు ఇలా మాట్లాడుతున్నారు. అధికార వికేంద్రీకరణ ద్వారా మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని సత్యాన్ని వాళ్లు గ్రహించి.. ఈ కుహనా వాదాలతో ప్రగతిని అడ్డుకునే కుట్రలను మానుకుంటే బాగుంటుంది.