తిరుపతిలో రాయలసీమ ఆత్మగౌరవ మహాప్రదర్శన, బహిరంగ సభ విజయవంతం కావడం వైసీపీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. తిరుపతి స్ఫూర్తితో రాయలసీమ వ్యాప్తంగా ఆ ప్రాంత ఆకాంక్షలపై గళమెత్తడం, అలాగే న్యాయ రాజధానికి మద్దతుగా పెద్ద ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించడానికి అధికార పార్టీ సమాయత్తం అవుతోంది. ఈ కీలక బాధ్యతల్ని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకున్నట్టు సమాచారం.
అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటు, అలాగే వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చంద్రబాబు చేస్తున్న ద్రోహాన్ని జనం దృష్టికి తీసుకెళ్లేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా అడుగు ముందుకేస్తోంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని ప్రజాసంఘాలు, విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు, కార్మికులు, రైతులను కలుపుకు వెళ్లాలని అధికార పార్టీ ఆలోచిస్తోంది.
రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చంద్రబాబు చేసిన, చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టడంతో పాటు వెనుకబడిన ప్రాంతాల ఆకాంక్షలను నెరవేర్చేందుకు జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు వైసీపీ కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ క్రమంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో తటస్థులతో జేఏసీలను ఏర్పాటు చేసి కథ నడించాలనే వ్యూహం రచిస్తోంది.
ఇప్పటికే ఉత్తరాంధ్రలో ఎగ్జిక్యూటివ్ రాజధానిపై చైతన్యం తీసుకురావడంలో సక్సెస్ అయ్యింది. ఇది మరింతగా జనంలోకి తీసుకెళ్లేందుకు ఇదే సరైన సమయం అని వైసీపీ భావిస్తోంది. రాయలసీమలో మొదటి నుంచి చంద్రబాబు తమ ప్రాంత వ్యతిరేకిగా ముద్రపడ్డారు. అందుకే చంద్రబాబును దోషిగా నిలిపే పని వైసీపీకి సులువైంది. రానున్న రోజుల్లో సీమ వ్యాప్తంగా తిరుపతి తరహాలో భారీ ప్రదర్శనలు, సభలు నిర్వహించనున్నారు.