నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌లో ఉన్నట్టుండి మార్పు. రాజకీయాలకు దూరంగా వుండాలని నిర్ణయం తీసుకున్నట్టు ట్వీట్. అంతేకాదు, గతంలో తానెవరినైనా బాధ పెట్టి వుంటే క్షమించాలని వేడుకోలు. ఏంటో అంతా కొత్తగా కనిపిస్తోంది. బండ్ల గణేష్ తనకు తాను రాజకీయ నాయకుడిగా అనుకోవడం తప్పితే, మరెవరూ ఆయన్ను ఆ రకంగా గుర్తించలేదన్నది వాస్తవం. తాజాగా రాజకీయాలకు దూరంగా వుంటున్నట్టు ఆయన ట్వీట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
బండ్ల గణేష్ రెండు వరుస ట్వీట్లు చేశారు. వాటి గురించి తెలుసుకుందాం.
“కుటుంబ బాధ్యతలు, వ్యాపారాలు, పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించి రాజకీయాలకు దూరంగా వుండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం, మిత్రుత్వంగానీ లేదు”
“అందరూ నాకు ఆత్మీయులు. అందరూ నాకు సమానులు. ఇంతకు ముందు నా వల్ల ఎవరైనా పత్యక్షంగా పరోక్షంగా బాధపడి వుంటే నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని” అంటూ బండ్ల గణేష్ ట్వీట్లు చేయడం చర్చనీయాంశమైంది. జనసేనాని పవన్‌కల్యాణ్‌కు వీర భక్తుడిగా తనకు తాను చెప్పుకోవడం తెలిసిందే. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో బండ్ల కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నప్పటికీ, టికెట్ దక్కలేదు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే బ్లేడ్‌తో గొంతుకోసుకుంటానని సంచలన కామెంట్స్ చేసి, వార్తలకెక్కారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడంతో కొంత కాలం ఎవరికీ కనిపించకుండా బండ్ల గణేష్ తప్పించుకు తిరిగారు. రాజకీయాల్లో ఎన్నో మాట్లాడుతుంటామని , గొంతుకోసుకుని చచ్చిపోవాలని మీరు కోరుకుంటారా? అని మీడియాని ఎదురు ప్రశ్నించారు.
ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటానని కొన్ని సందర్భాల్లో చెబుతూ వచ్చారు. ఆ మధ్య విజయసాయిరెడ్డిపై ఘాటు ట్వీట్లు పెట్టి రాజకీయంగా మళ్లీ తెరపైకి వచ్చారు. తాజాగా బండ్ల గణేష్ రాజకీయాలకు దూరంగా వుండాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించడం గమనార్హం. రాజకీయాల్లో వున్న వాళ్లు విరమించుకుంటున్నట్టు ప్రకటిస్తే అర్థం వుండేది. రాజకీయాల నుంచి విరమించడం, బాధ పెట్టి వుంటే క్షమించాలని కోరడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బండ్ల గణేష్‌లో జ్ఞానోదయమా? వైరాగ్యమా? అనే చర్చకు తెరలేచింది.