ఏపీ ఎన్జీవో అసోసియేషన్ 21వ రాష్ట్ర మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి ఉద్యోగులే అని ఆయన అన్నారు. ప్రభుత్వం పాలసీలు చేస్తే, వాటిని అమలు చేసేది మాత్రం ఉద్యోగులే అని ఆయన కొనియాడారు. ఉద్యోగుల సంతోషం, భవిష్యత్ తమ ప్రభుత్వ ప్రాధాన్యంగా ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వ కుటుంబంలో కీలక సభ్యులు ఉద్యోగులే అని ఆయన అన్నారు.
గ్రామస్థాయిలో సేవలు అందుబాటులోకి తెస్తూ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే 1.35 లక్షల శాశ్వత ఉద్యోగులను నియమించామ న్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఇబ్బందులు వస్తాయని వారించినా తాము మాత్రం వెనుకంజ వేయలేన్నారు. పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచామన్నారు. గత ప్రభుత్వం ఓట్లు వేయించుకోవాలన్న దుర్భుద్ధితో ఎన్నికల ముందు జీతాలు పెంచిందని విమర్శించారు.
ఉద్యోగాలు, ఉద్యోగుల విషయంలో చంద్రబాబుకు దారుణమైన అభిప్రాయాలున్నాయని ఈ సందర్భంగా సీఎం వివరించారు. బాబు దృష్టిలో కొందరు ఉద్యోగులు మాత్రమే మంచివాళ్లన్నారు. మిగిలిన వాళ్లంతా చెడ్డవారన్నారు. గతంలో ఏఏ ప్రభుత్వ శాఖలో ఎంతెంత అవినీతి వుందో బాబు పుస్తకంలో రాశారని, వాటి వివరాలను జగన్ వెల్లడించారు.
1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేశామన్నారు. తమ ప్రభుత్వం ఏ ఒక్క ఉద్యోగికి అన్యాయం చేయలేదన్నారు. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మీది. అని ఆయన అన్నారు. మీకు తోడుగా వుంటోందన్నారు.
ఏదైనా ఆర్థిక ఇబ్బందుల్లో కొద్దోగొప్పో మీరు అనుకున్న స్థాయిలో బహుశా తాను చేయలేక పోయి వుండొచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ మీ మీద మనసు నిండా ప్రేమ మాత్రం ఎక్కువగా ఉందనే సంగతి మరిచిపోవద్దని వేడుకున్నారు. ఉద్యోగులకు మంచి చేయడానికి నాలుగు అడుగులు వేయడానికి ఎప్పటికీ ముందుంటామని ఆయన అన్నారు.