హ‌రీశ్ నీ అడ్ర‌స్ గ‌ల్లంతు చేస్తా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వార్నింగ్‌!

బీఆర్ఎస్ జాబితా కాసేప‌ట్లో విడుద‌ల కానుంది. మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు సీఎం కేసీఆర్ రానున్న ఎన్నిక‌ల్లో త‌ల‌ప‌డే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ మేన‌ల్లుడు, ప్ర‌భుత్వంలో కీల‌క మంత్రి హ‌రీశ్‌రావుకు సొంత పార్టీ…

బీఆర్ఎస్ జాబితా కాసేప‌ట్లో విడుద‌ల కానుంది. మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు సీఎం కేసీఆర్ రానున్న ఎన్నిక‌ల్లో త‌ల‌ప‌డే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ మేన‌ల్లుడు, ప్ర‌భుత్వంలో కీల‌క మంత్రి హ‌రీశ్‌రావుకు సొంత పార్టీ ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఏకంగా హ‌రీశ్‌రావు అడ్ర‌స్‌ను గ‌ల్లంతు చేస్తాన‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వార్నింగ్ ఇవ్వ‌డంతో ఆ పార్టీ శ్రేణులు షాక్‌కు గుర‌య్యాయి. హ‌రీశ్‌రావు బీఆర్ఎస్‌లో ట్రబుల్ షూట‌ర్‌గా పేరు పొందారు. అంద‌రితో మంచిగా మాట్లాడి, స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తార‌ని ఆయ‌న గురించి చెబుతారు. అలాంటి హ‌రీశ్‌రావునే హెచ్చ‌రించ‌డం బీఆర్ఎస్‌లో టికెట్ల ప్ర‌క‌ట‌న రేపిన చిచ్చుగా భావించొచ్చు.

మంత్రి హ‌రీశ్‌రావును హెచ్చ‌రించిన ఆ ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు. ఈయ‌న మ‌ల్కాజ్‌గిరి నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. త‌నతో పాటు కుమారుడికి కూడా ఆయ‌న టికెట్ ఆశిస్తున్నారు. త‌న కుమారుడికి మెద‌క్ టికెట్ ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ నుంచి సానుకూల నిర్ణ‌యం రాన‌ట్టు ఆయ‌న తాజా కామెంట్స్ తెలియ జేస్తున్నాయి.

ఇవాళ ఆయ‌న తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం మీడియాతో మాట్లాడారు. తన కుమారుడికి, తనకు మెదక్, మల్కాజ్‌గిరి టిక్కెట్లు ఇస్తేనే బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేస్తామన్నారు. తన కుమారుడిని మెదక్ ఎమ్మెల్యే చేయడమే లక్ష్యమని మైనంప‌ల్లి స్ప‌ష్టం చేశారు. తనకు టికెట్ ఇస్తామ‌న్నార‌ని, అయితే తన కుమారుడికి  ఇవ్వకుంటే స్వ‌తంత్ర అభ్య‌ర్థులుగా బ‌రిలో నిలుస్తామ‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. కొవిడ్ సమయంలో తన కుమారుడు ఎంతో ప్రజాసేవ చేశాడని ఆయ‌న చెప్పుకొచ్చారు.

మెదక్‌లో హరీశ్‌రావు నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయ‌న విరుచుకుప‌డ్డారు. గ‌తాన్ని హరీశ్‌రావు గుర్తించుకోవాల‌ని హిత‌వు చెప్పారు. సిద్దిపేట వలే మెదక్‌ను ఎందుకు అభివృద్ధి చేయలేదని ఆయ‌న‌ ప్రశ్నించారు. వచ్చేసారి సిద్దిపేటలో పోటీ చేసి హరీశ్‌రావు అడ్రస్‌ గల్లంతు చేస్తానని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో మైనంప‌ల్లి నివాసంలో ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి మ‌ల్లారెడ్డికి వ్య‌తిరేకంగా భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. మైనంప‌ల్లి ఘాటు వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఆయ‌న‌కు టికెట్ ఇస్తారా? ఇవ్వ‌రా? అనేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది.